Iran USA War: 'చమురు చుక్క కూడా బయటకు పోనివ్వం'.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Iran USA War:హోర్ముజ్ జలసంధిపై దాడులు తాత్కాలికంగా తగ్గినప్పటికీ, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.

CR Reddy
Published on: 24 Aug 2026 9:53 AM IST
Iran USA War
X

Iran USA War

Iran USA War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. హోర్ముజ్ జలసంధిపై దాడులు తాత్కాలికంగా తగ్గినప్పటికీ, రెండు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్‌పై అమెరికా విధించే కొత్త ఆర్థిక ఆంక్షలను ఏ దేశమైనా సమర్థిస్తే, దాన్ని తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఇరాన్‌పై మునుపెన్నడూ లేని రీతిలో కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌ను ప్రపంచ దేశాల నుంచి పూర్తిగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ అడుగులు వేస్తోంది. ఈ చర్యలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన అధిపతి మొహ్సేన్ రెజాయ్ తీవ్రంగా స్పందించారు. తమ దేశంపై అమెరికా ఆర్థిక దాడిని కొనసాగిస్తే, పర్షియన్ గల్ఫ్ నుంచి ఏ ఒక్క దేశం కూడా చమురు ఎగుమతి చేయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలకు కఠిన హెచ్చరిక

సోషల్ మీడియా వేదికగా మొహ్సేన్ రెజాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆంక్షల వ్యూహానికి సహకరించే ఏ దేశానికైనా తగిన రీతిలో బుద్ధి చెబుతామని చెప్పారు. హోర్ముజ్ జలసంధితో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న అన్ని పర్షియన్ గల్ఫ్ మార్గాలను నిలిపివేస్తామని ఆయన తేల్చి చెప్పారు. సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తాబా ఖమేనీకి సైనిక సలహాదారుగా పనిచేసిన రెజాయ్, తమపై దాడి జరిగితే ఊహించని రీతిలో తిప్పికొడతామని హెచ్చరించారు.

అమెరికా నావికాదళ దిగ్బంధం

హోర్ముజ్ జలసంధిలో గత 48 గంటలుగా ఎలాంటి కొత్త దాడులు నమోదు కాలేదని అమెరికా నావికాదళం తెలిపింది. అయితే ఇరాన్ నౌకాశ్రయాలపై తాము విధించిన దిగ్బంధం కారణంగా ఇప్పటివరకు 70 వాణిజ్య నౌకల మార్గాలను మళ్లించగా, మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు తమ నిబంధనలను ఉల్లంఘించిన డజన్ల కొద్దీ నౌకల జాబితాను ఇరాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో ఆ నౌకలను సీజ్ చేస్తామని లేదా భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొంది.

శాంతి కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు

ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సంధి కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన సోమవారం తేహ్రాన్‌లో పర్యటించి ఇరాన్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు పునరుద్ధరించి యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ భాగం జరుగుతుంది. ఇరాన్ చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story