Netanyahu Next Move: ఇజ్రాయిల్ అమెరికా మధ్య ఇరాన్ చిచ్చు... నెతన్యాహు నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయిల్ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. నెతన్యాహు నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అన్నది ప్రధానాంశంగా మారింది.
Netanyahu Next Move: అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ కుదుపు చోటుచేసుకుంది. దశాబ్దాల శత్రుత్వానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా తెరుచుకోవడమే కాకుండా, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేయనుంది. అయితే ప్రపంచదేశాలన్నీ ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తుంటే, ఇజ్రాయిల్ మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. మిత్రదేశమైన అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇజ్రాయిల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహును తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు నెతన్యాహు వేయబోయే తదుపరి అడుగు ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇజ్రాయిల్ ఆగ్రహానికి ముఖ్య కారణాలు
అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఈ డీల్ కుదుర్చుకుందనేది ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. ఈ ఒప్పందంలో ఇజ్రాయిల్‌కు మింగుడుపడని అంశాలు ఉన్నాయి. రాన్ అణ్వాయుధాలు తయారు చేయనని చెబుతున్నప్పటికీ, వారి వద్ద ఉన్న ప్రమాదకర యూరేనియం నిల్వలను వేరే దేశానికి తరలించేలా ఈ ఒప్పందంలో ఎలాంటి నిబంధన లేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. రెండోది అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గంలో ఇరాన్‌కు పరోక్షంగా పూర్తి స్వేచ్ఛ లభించింది. దీనివల్ల ఇరాన్ ఓపెన్ మార్కెట్‌లో చమురు అమ్ముకుని ఆర్థికంగా మరింత బలపడుతుంది. అంతేకాదు, గాజా, లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తుండగా, అమెరికా వీటిని బహిరంగంగా ఖండించడం ఇజ్రాయిల్‌కు కోపం తెప్పించింది.
వెనక్కి తగ్గని నెతన్యాహు ... ముందున్న ఆప్షన్స్
అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, ఇజ్రాయిల్ ముందు ఇప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వెనక్కి తగ్గితే అది యూదుల మనోభావాలను దెబ్బతీస్తుంది. 2,000 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన యూదు జాతి, బానిసత్వ సంకెళ్లు తెంచుకుని వీరత్వం వైపు అడుగులు వేసింది. "అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం" అని ఇజ్రాయిల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. లెబనాన్‌లో ఆక్రమించుకున్న హిజ్బుల్లా స్థావరాల నుంచి ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
ఇజ్రాయిల్ గనుక తన పంథా మార్చుకోకుండా లెబనాన్, ఇరాన్ లక్ష్యంగా దాడులు తీవ్రం చేస్తే, అది అమెరికా దౌత్య నీతికి పెద్ద సవాలుగా మారుతుంది. శాంతి ఒప్పందం కుదిరినా, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలిగిపోలేదనే దానికి నెతన్యాహు దూకుడు వైఖరే నిదర్శనం. రాబోయే రోజుల్లో ఈ ముక్కోణపు వ్యూహం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.




