అమెరికా ముందు మూడు డిమాండ్లు... చిక్కుముడులతో ట్రంప్‌కు చిక్కులు

పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి.

Balachander
Published on: 29 April 2026 11:47 AM IST
అమెరికా ముందు మూడు డిమాండ్లు... చిక్కుముడులతో ట్రంప్‌కు చిక్కులు
X

Iran’s 3 Demands to US: పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్‌ 22తో మొదటి విడత కాల్పుల విరమణ ఒప్పందం ముగియకముందే రెండో విడత కాల్పుల విరమణను ప్రకటించాయి. అయితే, దీనికి కాలపరిమితిని విధించలేదు. పాకిస్తాన్‌ వేదికగా ఇరు పక్షాలు ముఖాముఖి చర్చలకు సిద్దంగా లేకపోవడంతో శాంతి చర్చలు ముందుకు సాగుతాయా లేదా అనే అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇరాన్‌ ఇప్పుడు అమెరికా ముంఉ మూడు దశల ప్రణాళికను ఉంచింది. ఇందులో మొదటిది ఇరాన్‌పై ఆంక్షలు తొలగించడం, రెండోది ఓడరేవుల దిగ్భంధాన్ని ఎత్తివేయడం. ఇలా చేస్తే హోర్ముజ్‌ జలసంధిని తెరుస్తామని ఇరాన్‌ ప్రకటించింది. ఈ రెండు దశలకు ఒప్పుకుంటేనే కీలకమైన మూడో దశ ముందుకు సాగుతుందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

అమెరికా ముందు ఇరాన్ 'త్రీ-స్టెప్' ప్లాన్ - ట్రంప్ అడుగు ఎటువైపు?

యుద్ధానికి ముగింపు పలికేందుకు... ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా మూడు డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను అమెరికా ముందు ఉంచారు. ఈ మూడింటిలో మొదటి రెండు పూర్తి కావాలని, రెండూ పూర్తయితేనే మూడో డిమాండ్‌పై చర్చలు జరుపుతామని ఇరాన్‌ స్పష్టం చేసింది.

చిక్కుముడులతో కూడిన మూడు దశలు

ఇరాన్‌ మెలికపెట్టిన మూడు దశల్లో మొదటిది యుద్ధానికి స్వస్తి పలకడం. అదేవిధంగా ఓడరేవుల ముట్టడిని నిలిపివేయడంతో పాటు లెబనాన్‌పై సైనిక చర్యలు మళ్లి ప్రారంభం కాబోవని గ్యారెంటీ ఇవ్వాలి. ఇది మొదటి దశ. ఈ దశ డిమాండ్లకు అమెరికా పాజిటీవ్‌గా రెస్పాండ్‌ కావాలి. పాజిటీవ్‌గా రెస్పాండ్‌ అయితే రెండో దశ డిమాండ్లు తెరపైకి వస్తాయి. రెండోదశలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ సహకరిస్తుంది. అంతేకాదు, హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు అంగీకరిస్తూనే నౌకల నుంచి రవాణా రుసుము వసూలు చేసేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలని ఇరాన్‌ చూస్తున్నది. ఈ కొత్త చట్టాలకు అమెరికా అంగీకరించాలన్నది డిమాండ్‌. ఈ రెండు దశల చర్చలు పూర్తయితేనే అణు చర్చలు ముందుకు సాగుతాయి. రెండు దశలు దాటకుండా అణ్వస్త్ర కార్యక్రమం, యూరేనియం శుద్దిపై చర్చలను ముందుకు తీసుకెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఇరాన్‌ ముందు ఆర్థికంగా లాభాలను, భద్రతపై భరోసా కల్పించిన తరువాతే వివాదాస్పద అంశాలపై మాట్లాడతామని స్పష్టం చేసింది.

సముద్రపు దొంగతనం అంటూ ఇరాన్ ఫిర్యాదు

ఇటీవలే ఇరాన్‌ నౌకలను అంతర్జాతీయ జలాల్లో అమెరికా సీజ్‌ చేయడాన్ని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం సముద్రపు దొంగతనం అని, అంతర్జాతీయ చట్టాలను అమెరికా కాలరాస్తోంది దుయ్యబట్టింది. అంతేకాదు, దీనిపై ఇరాన్‌ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ట్రంప్ స్పందన ఏమిటి?

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపిన వివరాల ప్రకారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతా సలహాదారులతో ఈ 3 దశల ప్రణాళికపై ఇప్పటికే ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. అమెరికా ఈ ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తోంది. అయితే, ఇరాన్ ఈ మూడు దశల ప్రతిపాదనలపై అధికారికంగా బయటకు ఏమీ చెప్పడం లేదు. అమెరికా స్పందనను చూశాక, తన బలాబలాలను బట్టి తదుపరి అడుగు వేయాలని ఇరాన్ భావిస్తోంది. మూడు దశల ప్రణాళికను అమెరికా ముందు ఉంచినా... ఇరాన్‌ తన యుద్ధ సన్నాహాలను, సైనిక బలాన్ని పెంచుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story