Iranian Crude: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. రూటు మార్చుకున్న భారీ ట్యాంకర్లు!

Iran Oil to India: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు. అమెరికా ఆంక్షల ఎత్తివేతతో రూటు మార్చుకున్న ఆయిల్ ట్యాంకర్లు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) దిగుమతి చేసుకునే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.

Arun Chilukuri
Published on: 8 April 2026 3:10 PM IST
Iranian Crude
X

Iranian Crude: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. రూటు మార్చుకున్న భారీ ట్యాంకర్లు!

Iranian Crude: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు తొలగిపోవడంతో, మళ్లీ భారత రిఫైనరీలు ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారి ఇరాన్ చమురు నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయి.

రూటు మార్చిన 'జయ' ట్యాంకర్

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి గ్రూప్ (LSEG) షిప్పింగ్ డేటా ప్రకారం.. ఇరాన్ నుంచి చైనా వైపు ప్రయాణించాల్సిన 'జయ' (Jaya) అనే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ తన గమ్యస్థానాన్ని మార్చుకుని భారత్ వైపు వస్తోంది. మొదట ఆగ్నేయాసియా జలాల గుండా చైనా వెళ్లాల్సిన ఈ నౌక, ఇప్పుడు భారత తీరం వైపు మళ్లింది. ఈ చమురును దేశీయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వినియోగించనున్నట్లు సమాచారం.

మరో ట్యాంకర్ కూడా సిద్ధం

కేవలం 'జయ' మాత్రమే కాకుండా, 'జోర్డాన్' అనే మరో చమురు ట్యాంకర్ కూడా తన గమ్యస్థానాన్ని భారత్‌గా సూచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో 'పింగ్ షున్' అనే నౌక భారత్ నుంచి చైనా వైపు వెళ్లగా, ఇప్పుడు దానికి భిన్నంగా చమురు నిల్వలు భారత్‌కు వస్తుండటం గమనార్హం.

2019 తర్వాత ఇదే తొలిసారి

ఒకప్పుడు ఇరాన్ చమురుకు భారత్ ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. 2018లో రోజుకు సగటున 5,18,000 బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యేది. 2019 మే నాటికి అమెరికా ఆంక్షల కారణంగా ఇది 2,68,000 బ్యారెళ్లకు పడిపోయింది.

అప్పటి నుంచి ఇరాన్ నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేయడంతో మళ్లీ ఇరాన్ నుంచి చవకగా ముడి చమురు లభించే అవకాశం కలిగింది.

ఈ పరిణామం వల్ల భారత ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల స్థిరీకరణకు కూడా దోహదపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story