Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎక్కడ? ఆసక్తి రేపుతున్న అదృశ్యం
Iran Israel War: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కొన్నిరోజులుగా కనిపించడం లేదు. క్షిపణి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారనే వార్తలు నిజమేనా?
Iran Israel War
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారనీ, కోమాలో ఉన్నారనీ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ వీటిని ఖండించినా.. ఖమేనీ ఇప్పటివరకూ కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అనేలా మరిన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా ది టెలిగ్రాఫ్ కు దొరికిన ఒక ఆడియో ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఇరాన్ కొత్తగా ఎంపికైన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, తన కుటుంబాన్ని, ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంలోని అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని భయంకర వైమానిక దాడి జరిగింది. అయితే, ఆ దాడి నుంచి వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది.
ది టెలిగ్రాఫ్‌కు లభించిన ఆడియోలో ఉన్న దాని ప్రకారం ఇరాన్ దివంగత సర్వోన్నత నాయకుడు అయతోల్లా ఖమేనీ, ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంలోని ఇతర సభ్యులను హత మార్చడం కోసం జరిగిన దాడిలోనే మొజ్తబా ఖమేనీ కూడా లక్ష్యంగా ఉన్నారు. అయితే, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ బ్లూ స్పారో బాలిస్టిక్ క్షిపణులు తన నివాసంపై దాడి చేయడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు, మొజ్తాబా తన తండ్రి భవంతి ఆవరణలో ఉన్న గార్డెన్ లో వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆ కొద్దిసేపు అయన భవనంలో లేకపోవడం ఆయన ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో ఆయన కాలికి స్వల్ప గాయం మాత్రమే అయ్యింది.
మార్చి 12న అలీ ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ, సీనియర్ మత పెద్దలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఈ ఆడియోను రికార్డ్ చేశారు. ఖమేనీ కుటుంబంపై దాడుల సమయంలో సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో ఏమి జరిగిందో ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
ఆ దాడిలో మొజ్తాబా భార్య జహ్రా హద్దాద్-అడెల్, వారి కుమారుడు బఘేర్ మరణించారని హొస్సేని వెల్లడించారు. ఖమేనీ మిలటరీ అధిపతి మొహమ్మద్ షిరాజీ మృతదేహంముక్కలు ముక్కలుగా పేలిపోయింది. మొత్తం ఖమేనీ కుటుంబాన్ని తుడిచిపెట్టడమే ఈ దాడి లక్ష్యం అని హుస్సేనీ ఆ ఆడియోలో చెబుతున్నారు.
మొజ్తాబా తన తండ్రి నివసించిన ప్రాంగణంలోనే నివసించాడు, అక్కడ అలీ ఖమేనీ ప్రసంగాలు చేసే ఒక మతపరమైన మందిరం, ఇతర పిల్లల నివాసాలు కూడా ఉండేవి.
క్షిపణులు ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేశాయని, వాటిలో కొన్ని నేరుగా సుప్రీం లీడర్ ను లక్ష్యంగా చేసుకున్నాయని హోస్సేని వివరించారు.
"మోజ్తాబా ఏదో పని మీద భవనం నుంచి బయటకు వెళ్లి తిరిగి రావాలన్నది దైవ సంకల్పం. క్షిపణులు భవనంపై దాడి చేసినప్పుడు ఆయన బయట ఉన్నారు. ఆయన భార్య హద్దాద్ మెట్ల నుంచి పైకి వెళ్తోంది. దీంతో ఆమె అక్కడికక్కడే అమరులయ్యారు," అని హోస్సేని ఆ ఆడియోలో చెప్పినట్లు వినిపించింది.
ఆయన సోదరుడు మోస్తఫా ఖమేనీ, ఆయన భార్య సమీపంలోని మరో నివాసంలో ఉండగా, దానిపై కూడా దాడి జరిగింది. దుమ్ము, శిథిలాలు వారిని పాక్షికంగా కాపాడటంతో, వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిలో అలీ ఖమేనీతో పాటు, ఆ ప్రాంగణంలో ఒక సమావేశానికి హాజరైన ఐఆర్‌జిసి అధిపతి మొహమ్మద్ పక్‌పూర్, ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్‌జాదే వంటి సీనియర్ అధికారులు కూడా మరణించారు.
ఇరాన్ సైనిక కమాండ్‌కు, సుప్రీం లీడర్ కు మధ్య షిరాజీ ఒక కీలకమైన వారధిగా ఉన్నందున, వారసత్వ ప్రణాళికకు భంగం కలిగించడమే మహమ్మద్ షిరాజీపై జరిగిన దాడి ముఖ్య ఉద్దేశ్యమని హొస్సేని అన్నారు.
మొజ్తబా ఖమేనీ గాయాలు, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్నా ఊహాగానాల మధ్య ఈ ఆడియో బయటపడింది. అంతకుముందు, వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన తర్వాత మొజ్తబా కోమాలో ఉన్నారని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అతని ప్రస్తుత పరిస్థితి గురించి సైనిక కమాండర్లకు ఎలాంటి సమాచారం లేదని ఒక ఇరానియన్ అధికారి 'ది టెలిగ్రాఫ్'కు తెలిపారు.
మోజ్తాబా ఎంపికయ్యారు, కానీ అది సుప్రీం లీడర్ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది, బహుశా తన ఎంపిక మోజ్తాబాకు కూడా ఇష్టం లేకపోయి ఉండవచ్చని.. అందుకే ఆయన ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదని ఆ ఇరానియన్ అధికారి చెప్పినట్టు టెలిగ్రాఫ్ పేర్కొంది.
1985 మార్చిలో ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో మోజ్తాబా ఫ్రంట్ ఎండ్ లో విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే తన 17 ఏళ్ల వయసులో ఒక వారం పాటు అదృశ్యమవ్వడంతో మొజ్తాబా తొలిసారిగా ప్రజల దృష్టిలో పడ్డారు. అప్పుడు ఆయన ఆ సంఘర్షణ నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐఆర్‌జిసి కమాండర్లు మొదట్లో అతన్ని అనుభవం లేనివాడిగా భావించారు.
ఇక తాజా క్షిపణి దాడుల తర్వాత అలీ ఖమేనీ ఇతర పిల్లలెవరూ బహిరంగంగా కనిపించలేదు. మొజ్తాబా నుంచి కూడా ఒకే ఒకసారి ప్రభుత్వ టెలివిజన్‌లో ఒక రాతపూర్వక సందేశం మాత్రమే వచ్చింది.




