Krakatau volcano eruption: ఇండోనేషియాలో అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం!
Krakatau volcano eruption: ఇండోనేషియాలో అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలైంది. జకార్తాలో 300కు పైగా విమానాలు రద్దుకాగా, 22 వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Krakatau volcano eruption: ఇండోనేషియాలో అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం!
Krakatau volcano eruption: ఇండోనేషియాలోని ప్రసిద్ధ అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందడంతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. శుక్రవారం రాత్రి నుంచి ఉగ్రరూపం దాల్చిన ఈ అగ్నిపర్వతం నుంచి దట్టమైన బూడిద, ధూళి మేఘాలు వెలువడుతుండటంతో రాజధాని జకార్తాలోని విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుందారా జలసంధి ప్రాంతంలో ఆకాశాన్ని కమ్మేసిన బూడిద మేఘాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆదివారం ఉదయానికి విమానాశ్రయ పరిసరాలను కమ్మేయడంతో విపత్తు నిర్వహణ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. తొలుత ఉదయం 9:30 గంటల వరకు, ఆపై పరిస్థితి తీవ్రతను బట్టి సాయంత్రం 5:30 గంటల వరకు సర్వీసులను నిలిపివేశారు. దీంతో మొత్తం 301 విమానాలు రద్దు కాగా, అందులో 58 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఫలితంగా సింగపూర్, దోహా, సిడ్నీ, కౌలాలంపూర్ మార్గాల్లో ప్రయాణించాల్సిన 22,000 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింగపూర్, మలేషియా ఎయిర్‌లైన్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు జకార్తాకు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి.
ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి బూడిద మేఘాలు జావా వైపు 20,000 అడుగులు, సుమత్రా వైపు 50,000 అడుగుల ఎత్తు వరకు వ్యాపించాయని, నిరంతర భూ ప్రకంపనలు, లావా వెదజల్లడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందని అధికారులు తెలిపారు. గాలిలో బూడిద శాతం పెరగడంతో కంటి సమస్యల దృష్ట్యా పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతానికి సునామీ ముప్పు ఏదీ లేదని అధికారులు వెల్లడించినప్పటికీ, ప్రజలు మాస్కులు, కళ్లజోళ్లు ధరించాలని సూచించారు. కాగా, పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో 2018లో ఇదే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల వచ్చిన సునామీకి 400 మందికి పైగా బలికావడం గమనార్హం.




