Earthquake: 7.7 తీవ్రతతో భయానక భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Earthquake: శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలోని తీర ప్రాంత ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.

CR Reddy
Published on: 15 Aug 2026 7:01 AM IST
Indonesia Earthquake Today
X

Indonesia Earthquake Today

Earthquake: ఇండోనేషియా తీర ప్రాంతంలో శనివారం ఉదయం 7.7 తీవ్రతతో సంభవించిన భయంకరమైన భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సముద్ర గర్భంలో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రతకు అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలు జారీ చేసి, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలోని తీర ప్రాంత ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:58 గంటలకు 7.7 తీవ్రతతో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఈ భయాకార ప్రకంపనల ధాటికి ఇళ్లు, భవనాలు ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటం వల్లే భూమి తీవ్రస్థాయిలో ప్రకంపనలకు లోనైందని తెలుస్తోంది.

అలర్ట్ అయిన అధికారులు.. సునామీ భయం

భూకంపం సంభవించిన వెంటనే ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక ఏజెన్సీ అత్యవసర సునామీ హెచ్చరికలను జారీ చేసింది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడే పెద్ద అలలు తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్ర తీరాలు, నదీ తీర ప్రాంతాలకు ప్రజలు ఎవరూ వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను తక్షణమే ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని యంత్రాంగం మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది. సముద్ర మట్టంలో వస్తున్న మార్పులను అలల తీవ్రతను కొలిచే గేజ్‌ల సహాయంతో నిమిష నిమిషానికి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

రింగ్ ఆఫ్ ఫైర్ శాపం.. కంటిమీద కునుకు లేని జనం

సుమారు 17 వేలకు పైగా చిన్న, పెద్ద దీవుల సమూహమైన ఇండోనేషియాను తరచూ ఇటువంటి విపత్తులు వెంటాడుతూనే ఉంటాయి. పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలోని అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ దేశం విస్తరించి ఉంది. అగ్నిపర్వతాలు, భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర కదలికల వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఏ విపత్తు ముంచుకొస్తుందోనని నిత్యం భయం గుప్పిట్లోనే కాలం వెళ్లదీస్తుంటారు.ప్రస్తుతానికి ఈ భారీ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు నివేదికలు అందలేదు. సముద్రంలో అలల పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు, సునామీ ముప్పు పూర్తిగా తొలగిపోయేవరకు ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story