Israel Iran War : ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని ఖతం? సోషల్ మీడియా షేక్.. అసలు నిజం ఇది
Israel Iran War : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన మరణ వార్తలను కొట్టిపారేశారు. తాను క్షేమంగా ఉన్నానని, కాఫీ తాగుతూ ఏఐ రూమర్లను ఎగతాళి చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Benjamin Netanyahu
Israel Iran War : ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు చనిపోయారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు టీవీల్లో కనిపిస్తున్నది ఆయన కాదని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన మాయాజాలమని రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే, వీటన్నింటికీ నెతన్యాహు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక సరదా వీడియోను పోస్ట్ చేస్తూ, తను క్షేమంగా ఉన్నానని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఈ వీడియోలో నెతన్యాహు ఒక కేఫ్‌లో ఎంతో హాయిగా కాఫీ తాగుతూ కనిపించారు. "నేను చనిపోయానని అందరూ అనుకుంటున్నారా? కానీ నేను మాత్రం ఈ కాఫీ కోసమే బతుకుతున్నాను" అంటూ చమత్కరించారు. నిజానికి ఆయన హిబ్రూ భాషలో ఒక సామెతను వాడారు, దాని అర్థం ఏదైనా వస్తువు తనకు చాలా ఇష్టమని చెప్పడం. ఈ చిన్న జోక్‌తో తన మరణ వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలు చూపుతున్న ధైర్యాన్ని, ఐక్యతను ఆయన కొనియాడారు. తన దేశంపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
ఇక ఏఐ వీడియోల గురించి వస్తున్న విమర్శలకు కూడా ఆయన గట్టి సమాధానమే ఇచ్చారు. అంతకుముందు నెతన్యాహు మాట్లాడిన ఒక వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో, అది డీప్‌ఫేక్ వీడియో అని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. నెతన్యాహు తాజా వీడియోలో తన రెండు చేతులను కెమెరా ముందుకు చాపి చూపించారు. తనకు పది వేళ్లే ఉన్నాయని, ఎలాంటి ఏఐ టెక్నాలజీ వాడలేదని నవ్వుతూ నిరూపించారు. దీంతో ఆ కుట్ర సిద్ధాంతాలన్నీ పటాపంచలయ్యాయి.
אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 15, 2026
అయితే, ఈ వీడియో వెలుగులోకి రావడానికి ముందే ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నెతన్యాహుకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. "ఆ పిల్లల హంతకుడు ఇంకా బతికే ఉంటే, మేం అతన్ని వదిలిపెట్టం.. వేటాడి మరీ చంపేస్తాం" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు తాను క్షేమంగా ఉన్నానని, శత్రువుల హెచ్చరికలకు భయపడటం లేదని చెప్పడానికే ఈ కాఫీ వీడియోను విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.




