Hormuz Strait Route Map: హోర్ముజ్‌ రూట్‌మ్యాప్‌...ఎంట్రీ ఎగ్జిట్‌ పాయింట్స్‌ ఇవే

Hormuz Strait Route Map: ప్రపంచ చమురు రవాణాకు ఆయుపుపట్టైన హోర్ముజ్‌ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది.

Balachander
Published on: 9 April 2026 10:29 AM IST
Hormuz Strait Route Map
X

Hormuz Strait Route Map

Hormuz Strait Route Map: ప్రపంచ చమురు రవాణాకు ఆయుపుపట్టైన హోర్ముజ్‌ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. ఇరాన్‌-అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో, ఈ సముద్ర మార్గం వినియోగంపై కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. ముఖ్యంగా నౌకల రాకపోకల కోసం ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను స్పష్టంగా ప్రకటించడం గమనార్హం.

ఎంట్రీ ఎగ్జిట్‌ పాయింట్స్‌

ఈ హోర్ముజ్‌ జలసంధి గుండా ప్రతిరోజూ సుమారు 2 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటాను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే ఏ చిన్న మార్పు కూడా అంతర్జాతీయ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపుతుంది.తాజా పరిస్థితుల్లో, ఇరాన్‌ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేస్తూ నౌకలకు నిర్దిష్ట మార్గాలను సూచించింది. ఒమన్‌ సముద్రం నుంచి గల్ఫ్‌ వైపు ప్రవేశించే నౌకలు లారాక్‌ ద్వీపానికి ఉత్తరంగా ప్రయాణించాలి. అదే విధంగా గల్ఫ్‌ నుంచి బయటకు వెళ్లే నౌకలు లారాక్‌ ద్వీపానికి దక్షిణంగా ప్రయాణించి ఒమన్‌ సముద్రంలోకి వెళ్లాలని సూచించింది. ఈ మార్గాలు అనుసరించడం తప్పనిసరి అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ స్పష్టం చేసింది. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భద్రతాపరమైన కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇరాన్‌ నేవీ సముద్రంలో మైన్‌లను ఏర్పాటు చేసింది. అందువలన ఈ జలసంధిలో నౌకలు ప్రయాణం చేయాలంటే ఇరాన్‌ నేవీని సమన్వయం చేసుకోవాలి. భద్రతాపరంగా ఇది కీలకమైన చర్యగా చెప్పవచ్చు.

టోల్‌ వసూలు

యుద్ధం ముందు వరకు ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు ఎటువంటి టోల్‌ వసూలు ఉండేది కాదు. ఈ జలసంధిని అంతర్జాతీయ జలమార్గంగా పరిగణించడం వలన ఎలాంటి సుంకాలు ఉండేవి కాదు. కాని, యుద్ధం తరువాత ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు తప్పనిసరిగా టోల్‌ కట్టాలని ఇరాన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ టోల్‌ను ఇరాన్‌, ఒమన్‌ దేశాలు వసూలు చేయబోతున్నాయి. ఇది కనుక అమల్లోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.

తగ్గని ఉద్రిక్తత

కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇటీవల ఈ జలసంధి గుండా నౌకల రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని నౌకలను మాత్రమే ఇరాన్‌ అనుమతి ఇస్తోంది. ఇదే సమయంలో లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా వెంటనే హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవాలని ఇరాన్‌ను కోరింది. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా కాల్పుల విరమణకు మద్దతు ప్రకటించినప్పటికీ, లెబనాన్‌ విషయంలో అది వర్తించదని స్పష్టం చేసింది. దీంతో ప్రాంతంలో పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది.

మొత్తంగా చూసుకుంటే కనుక హోర్ముజ్‌ జలసంధిలో ఏర్పాటు కానున్న ఎంట్రీ ఎగ్జిట్‌ పాయింట్లు ప్రపంచ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నౌకలు భారీ మొత్తంలో టోల్‌ కడితే... ప్రపంచదేశాల్లో చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల జీవన వ్యయాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ మార్గం ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలని, భద్రంగా ఉండాలని ప్రపంచదేశాలు కోరుకుంటాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story