Hormuz: కొంపముంచిన ఇజ్రాయెల్..అదును చూసి దెబ్బ కొట్టిన ఇరాన్

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో హర్మూజ్ జలసంధి దిగ్బంధనం. 187 చమురు ట్యాంకర్లతో సహా 1000 నౌకలు నిలిచిపోయాయి.

Naresh.k
Published on: 10 April 2026 8:49 AM IST
Hormuz Strait Blockade 1000 Ships Stranded
X

Hormuz Strait Blockade 1000 Ships Stranded

Iran - Israel War: శాంతి ప్రయత్నాలన్నీ నీటి మూటలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఆయుష్షు కేవలం కొన్ని గంటలేనని తేలిపోయింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈ పరిణామాలకు ప్రతిచర్యగా ఇరాన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అదే.. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ దిగ్బంధనం.

కాల్పుల విరమణను కాటేసిన దాడులు

నిజానికి ఒప్పందం అమలులోకి వచ్చిన తొలి గంటల్లో పరిస్థితులు ఆశాజనకంగానే కనిపించాయి. గ్రీకుకు చెందిన NJ Earth, లైబీరియా నౌక Daytona Beach వంటివి సురక్షితంగా జలసంధిని దాటి వెళ్లాయి. కానీ, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ తన అసలైన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి, జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఇరాన్ నావికాదళం యుద్ధ నౌకలతో పహారా కాస్తోంది. AUROURA అనే భారీ చమురు ట్యాంకర్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా, ఇరాన్ దళాలు దానిని అడ్డుకున్నాయి. దీంతో ముసందమ్ తీరం సమీపంలో ఆ నౌక బలవంతంగా వెనుదిరగాల్సి వచ్చింది.

సముద్రం మధ్యలో ట్రాఫిక్ జామ్

తాజా మారిటైమ్ ట్రాకింగ్ డేటా చూస్తుంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్థమవుతోంది. మంగళవారం నాటి లెక్కల ప్రకారం..దాదాపు 187 భారీ చమురు ట్యాంకర్లు సరకుతో నిండిపోయి నిలబడిపోయాయి.మొత్తం 1,000కి పైగా అంతర్జాతీయ నౌకలు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయాయి.నిపుణుల అంచనా ప్రకారం.. ఇప్పుడే జలసంధిని తెరిచినా, అక్కడ పేరుకుపోయిన ట్రాఫిక్ క్లియర్ కావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది.

మన జేబులకు చిల్లు పడనుందా?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో మూడింట ఒక వంతు ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోవడంతో గ్లోబల్ సప్లై చైన్ కుప్పకూలే ప్రమాదం ఉంది. చమురు సరఫరా ఆగితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర అమాంతం పెరిగిపోతుంది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై నేరుగా ఉంటుంది. రవాణా వ్యయం పెరిగితే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తుంది.

Naresh.k

Naresh.k

Next Story