US-Iran: హోర్ముజ్ సంక్షోభానికి పరిష్కారం .. ఖతార్‌లో మంగళవారం కీలక సమావేశం
ఎట్టకేలకు ఇరాన్ అమెరికా మధ్య మరోసారి చర్చల ఒప్పందం కుదిరింది. మంగళవారం ఖతార్ వేదికగా చర్చలు జరగనున్నాయి. ఆర్టికల్ 5ని ఎవరి నచ్చినట్టు వారు అర్ధం చేసుకోవడంతోనే తాజా దాడులు జరిగినట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
US-Iran: మధ్యప్రాచ్యంలో ముదిరిన సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హోర్ముజ్ జలసంధి వివాదానికి దౌత్యపరమైన ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ముఖాముఖి సాంకేతిక చర్చలు జరపడానికి అంగీకరించాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వీగిపోయే ప్రమాదం ఏర్పడటంతో, అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్ల నడుమ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి పరస్పర సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించడంతో, హోర్ముజ్ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
జలసంధిపై పట్టు కోసం సవాళ్లు ...ప్రతిసవాళ్లు
గత వారంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసిందనే ఆరోపణలతో అమెరికా మిలిటరీ ఆ దేశ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ సైన్యం బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపైకి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే, ఈ ఘర్షణలకు అసలు కారణం దాడులకంటే చర్చలే కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 5 ను ఇరు దేశాలు తమకు నచ్చినట్లుగా అర్థం చేసుకున్నాయి. ఈ నిబంధన ప్రకారం హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించాలి. బదులుగా అమెరికా ఇరాన్ రేవులపై ఉన్న ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించాలి. అయితే, స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తో నేరుగా మాట్లాడటానికి ఒక హాట్‌లైన్ ఏర్పాటుకు అంగీకరించింది. కానీ, తమ అనుమతి లేకుండా నౌకలు వెళ్లడానికి వీల్లేదని ఇరాన్ పట్టుబట్టడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
స్విట్జర్లాండ్ నుండి దోహాకు మారిన వేదిక.. ఎందుకంటే?
నిజానికి ఇరు దేశాల ప్రతినిధులు ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించడానికి స్విట్జర్లాండ్‌లో భేటీ కావాల్సి ఉంది. కానీ హోర్ముజ్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంతో చర్చల అజెండాతో పాటు వేదిక కూడా ఖతార్‌లోని దోహాకు మారింది. మరోవైపు, అమెరికా తమకు ఇవ్వాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయ ప్రతినిధి మెహదీ ఫజాయేలి గత ఆదివారం నాటి చర్చలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్, ఆర్ఎస్ఎఫ్ వంటి శక్తులకు ఆయుధాలు సరఫరా చేసే కంపెనీలపై ఆంక్షలు కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం దోహాలో జరిగే సాంకేతిక చర్చలు సఫలమైతేనే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అదుపులో ఉంటాయని, లేదంటే అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభంలో పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




