History of Gulf Wars: గల్ఫ్‌లో యుద్ధాలకు పునాది ఎప్పుడు పడిందో తెలుసా?
History of Gulf Wars: నేడు గల్ఫ్ దేశాలంటే మనకు గుర్తుకొచ్చేది ఆకాశాన్ని తాకే భవంతులు, విలాసవంతమైన జీవనం, చమురు నుంచి వచ్చే సంపద.
History of Gulf Wars
History of Gulf Wars: నేడు గల్ఫ్ దేశాలంటే మనకు గుర్తుకొచ్చేది ఆకాశాన్ని తాకే భవంతులు, విలాసవంతమైన జీవనం, చమురు నుంచి వచ్చే సంపద. మెరుపు లాంటి ఈ దేశాల చరిత్ర వెనుక వేల ఏళ్ల రక్తపాతం, యుద్ధాల చరిత్ర దాగుంది. నేటి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మెసొపొటేమియా నాగరికతకు నిలయం. సుమారు 4వేల నుంచి 5 వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఆవిర్భవించిన నాగరికత ఇది. ఆ నాగరికత కాలంలో అశాంతి, యుద్ధాలకు పునాదులు పడ్డాయి.
నాగరికత పురిటిగడ్డ.. యుద్ధాల అడ్డా
ప్రపంచ మానవ నాగరికతకు ఊపిరిపోసిన టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య వెలసిన ఈ నాగరికత ప్రపంచానికి వ్యవసాయం, లిపి, పట్టణ నిర్మాణం వంటి అనేక రంగాల్లో మార్గదర్శకం అయింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎంత వేగంగా జరిగిందో అంతే వేగంగా ఘర్షణలు కూడా పెరిగాయి. నీటి వనరులు, భూమి, వాణిజ్య మార్గాల కోసం ఆనాటి రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. చరిత్రకారుల అంచనా ప్రకారం, సామాన్యశకం 2000 ప్రాంతం నుంచే ఈ ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాల మధ్య పోరాటాలు, యుద్ధాలు ప్రారంభమయ్యాయి. తరువాతి కాలంలో బాబిలోనియన్, అస్సిరియన్, పర్షియన్ సామ్రాజ్యాలు పరస్పరం యుద్ధాలు చేస్తూ ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. ఈ యుద్ధాలు కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా ఆర్థిక, మత పరమైన కారణాలతో కూడా కొనసాగాయి.
కాలక్రమేణా విదేశీ దండయాత్రలు కూడా ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరంగా మార్చాయి. గ్రీకులు, రోమన్లు, తర్వాత ఇస్లామిక్ సామ్రాజ్యాలు, చివరకు యూరోపియన్ వలస శక్తులు కూడా గల్ఫ్‌పై ప్రభావం చూపాయి. ప్రతి దశలో కొత్త సరిహద్దులు ఏర్పడినా… పాత వివాదాలు మాత్రం పూర్తిగా ముగియలేదు.
మట్టిలో దాగిన యుద్ధ వాసనలు
ఆధునిక కాలంలో చమురు వనరుల ఆవిష్కరణతో గల్ఫ్ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. 20వ శతాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన యుద్ధాలు ముఖ్యంగా ఇరాన్-ఇరాక్ యుద్ధం, గల్ఫ్ వార్, అంతర్గత కల్లోలాలు లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఇప్పటికీ రాజకీయ, మత, ఆర్థిక విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంకేతికంగా ఎంత ఎదిగినా, బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడాలు ఎన్ని వెలిసినా.. గల్ఫ్ నేలలో దాగిన యుద్ధం తాలూకూ నెత్తురు వాసన ఇప్పటికీ పచ్చిగానే ఉంది. చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ శాంతి అనేది కేవలం రెండు యుద్ధాల మధ్య ఉండే విరామం మాత్రమేనని అనిపిస్తుంది. నేటి గల్ఫ్ ఉద్రిక్తతలు అర్థం కావాలంటే, మనం ఆనాటి మెసొపొటేమియా శిథిలాల నుంచి సాగిన రక్తాక్షరాల చరిత్రను చదవాల్సిందే. ఎప్పటికైనా గల్ప్‌లో ఉద్రిక్తతలు చల్లారుతాయని, శాశ్వతమైన శాంతి పవనాలు వీస్తాయని ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈసారైనా ఆ చల్లని వార్తను వింటారో లేదో కాలమే నిర్ణయించాలి.


