Africa Camels: గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. ఆఫ్రికా ఒంటెలకు పెరుగుతున్న ముప్పు
పెరుగుతున్న వేడి కారణంగా ఆఫ్రికా దేశాల్లో ఒంటెల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి.
Africa Camels: గ్లోబల్ వార్మింగ్ ధాటికి ఎడారి ఓడలుగా పేరొందిన ఒంటెలు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ఏకైక జంతువుగా పేరొందిన ఒంటెలు, ఆఫ్రికాలో సంభవిస్తున్న ఉష్ణోగ్రతల పెరుగుదల, తీవ్రమైన కరువుల వల్ల మరణిస్తున్నాయని పర్యావరణ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతలు... ఒంటెల ఆరోగ్యంపై ప్రభావం
ఉత్తర ఆఫ్రికా, ఆఫ్రికా కొమ్ము ప్రాంతం ప్రపంచంలోని మొత్తం ఒంటెల జనాభాలో 80% కి నిలయంగా ఉన్నాయి. అయితే, సోమాలియాలోని సూల్ ప్రాంతంలో కరువు, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 73% ఒంటెలు మరణించాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇక, కేన్యాలోని మార్సాబిట్ కౌంటీలో గడిచిన రెండేళ్లలో ఉష్ణోగ్రతల ఒత్తిడి వల్ల ఒంటెల మరణాలు 15% కంటే ఎక్కువ పెరిగాయి. ఉష్ణోగ్రతలు 41°C నుండి 45°C దాటినప్పుడు, ఒంటెల తెల్ల రక్తకణాలు దెబ్బతిని రోగనిరోధక వ్యవస్థ నశిస్తుందని ఆల్జీరియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతం ప్రతి దశాబ్దానికి 0.43°C చొప్పున అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 2024 నుండి పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50°C ని దాటుతున్నాయి. ఇలా ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటెలు తీవ్రమైన ఒత్తిడికి గురై మరణిస్తున్నాయి.
తగ్గిపోతున్న పాల ఉత్పత్తి
ఆఫ్రికాలోని ప్రజలు ఒంటె పాలపైనే ఆధారపడి జీవిస్తారు. ఒంటె పాలు ఆరోగ్యంతో పాటు మెడిసినల్ పరంగా కూడా ఉపయోగిస్తారు. అయితే, తీవ్రమైన వేడి కారణంగా ఒంటెల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఒంటెల పునరుత్పత్తి సామర్థ్యం కూడా దారుణంగా పడిపోయింది. ఆఫ్రికాలోని మెజారిటీ ప్రజలకు ఈ ఒంటెలే జీవనాధారం. ఆకలి తీర్చేది ఈ ఒంటెల మాంసం, పాలే. కానీ, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇథియోపియా, సోమాలియాలోని సంచార జాతులు తమ ప్రాంతాలను వదలి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మరింత దారుణంగా మారే అవకాశాలు ఉండటంతో ఆఫ్రికా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. సహజవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోవడమే ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు.




