Global Tensions After Failed Peace Talks: తలోదిక్కుగా ప్రపంచదేశాలు.. శాంతిని నెలకొల్పేదెవరు?
Global Tensions After Failed Peace Talks: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్నాయి.
Global Tensions After Failed Peace Talks: తలోదిక్కుగా ప్రపంచదేశాలు.. శాంతిని నెలకొల్పేదెవరు?
Global Tensions After Failed Peace Talks: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా సుమారు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా మొండితనం ఒకవైపు, ఇరాన్ పంతం మరోవైపు వెరసి.. ప్రపంచం ఇప్పుడు మరో భారీ ఆర్థిక సంక్షోభం అంచున నిలబడింది.
వివాదం - చర్చలు విఫలం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి కూర్చున్నారు. కానీ, చర్చల గమ్యం దిశ మార్చుకుంది. ప్రధానంగా ఇరాన్ తన అణ్వాయుధ తయారీకి అనుమతి కోరడం, హోర్ముజ్ జలసంధిపై టోల్ విధానాన్ని ప్రతిపాదించడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. చర్చలు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో జేడీ వాన్స్‌కు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుండి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ తర్వాతే అమెరికా తన మాట మార్చిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. దీనివల్ల చర్చల నుంచి అమెరికా ప్రతినిధి అర్ధాంతరంగా వైదొలిగారు.
శాంతి చర్చలను కొనసాగిస్తాం
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఒకవైపు శాంతి చర్చలను కొనసాగిస్తామని చెబుతూనే, మరోవైపు రక్షణ చర్యల్లో వేగం పెంచింది. విశ్లేషకుల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ సౌదీ అరేబియాకు 13,000 మంది సైనికులు, అలాగే 10 నుంచి 18 వరకు ఫైటర్ జెట్ విమానాలు పంపింది. అదేవిధంగా క్షిపణీ నిరోధక వ్యవస్థను కూడా అందించినట్లు తెలుస్తోంది. ఈ చర్యలు పరిస్థితిని ఎంత తీవ్రంగా మారుస్తుందో సూచిస్తున్నాయి. ఇరాన్ క్షిపణుల కారణంగా సౌదీ భూభాగం చాలా వరకు దెబ్బతిన్నది. చమురు కేంద్రాలు దెబ్బతిన్నాయి. 1960లో జరిగిన ఒప్పందం ప్రకారమే తాము సైన్యం, యుద్ధవిమానాలను సౌదీకి పంపినట్లుగా పాకిస్తాన్ చెబుతోంది.
ప్రపంచదేశాలు ఎటువైపు
ఇక యుద్ధం మళ్లీ ప్రారంభమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణా అంతరాయం కలిగితే, ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని యూరప్ దేశాలు ఇరాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నాయి. “యుద్ధం మాకు అవసరం లేదు” అని స్పష్టంగా చెప్పుతున్నాయి.
నాటో దేశాల నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు లభించకపోవడంతో అమెరికా ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో ఉంది. టోల్ చెల్లించకుండా వెళ్లే చమురు నౌకలను అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేయడం మరో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో చాలా దేశాలు తమ ఆయిల్ షిప్పులకు రక్షణగా నౌకాదళాలను పంపిస్తున్నాయి. ఈ చర్యలు ఆయా దేశాలపై ఆర్థిక భారం పెంచే అవకాశం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు తలోదిక్కుగా మారుతున్నాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు శాంతి...ఈ రెండింటి మధ్య ప్రపంచం చిక్కుకుంది. సాధారణ ప్రజలపై దీని ప్రభావం మరింత తీవ్రమవుతుంది. ధరలు పెరగడం, ఆర్థిక అస్థిరత, భద్రత సమస్యలు సామాన్యుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి.
శాంతిధూత ఎవరు
ప్రస్తుతం అత్యవసరంగా కావలసింది శాంతి చర్చలకు పునాది వేయగల నాయకత్వం. ఎవరు ముందుకు వచ్చి ఈ ఉద్రిక్తతలను తగ్గిస్తారు? ఎవరు ప్రపంచానికి శాంతి దారి చూపిస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి ముందున్నాయి. పశ్చిమాసియాలో మొదలైన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ముందు, శాంతి సాధన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది.




