Sheikh Hasina : 150కి పైగా కేసులు.. మరణశిక్ష ముప్పు.. అయినా షేక్ హసీనా బంగ్లాకు ఎందుకు వెళ్తున్నారు ?
Sheikh Hasina : 150కి పైగా కేసులు, మరణశిక్ష పడినప్పటికీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Sheikh Hasina
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం పతనమైన రెండు సంవత్సరాల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. రాజధాని డాకాకు తిరిగి వెళ్లడంపై వార్తా సంస్థ AFPతో మాట్లాడుతూ.. "అక్కడ నన్ను ఉరితీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నాకు తెలుసు. అయినప్పటికీ నా సొంత ప్రజలు నన్ను పిలుస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను" అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆమె ప్రభుత్వం పతనమైన తర్వాత ప్రత్యేక విమానంలో భారత్ వచ్చారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఉంటుండగా, ఆమెపై బంగ్లాదేశ్‌లో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 కేసుల్లో ఆమెను దోషిగా తేల్చగా, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు గాను అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష కూడా విధించింది.
1. పారిపోయిన నేత అనే ముద్రను చెరిపేసేందుకు
షేక్ హసీనా ప్రస్తుతం తన రాజకీయ జీవితంలో ఆఖరి దశలో ఉన్నారు. ఆమె తన జీవితాంతం బంగ్లాదేశ్ కోసం ధారపోశారు. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతిపితగా నిలిచారు. ఈ క్రమంలోనే షేక్ హసీనా తన జీవిత చరమాంకాన్ని సొంత దేశంలోనే గడపాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం పడిపోగానే దేశం విడిచి పారిపోయిన నాయకురాలిగా పడిన అపవాదును, ప్రతిష్టాత్మక ముద్రను తుడిచిపెట్టేయాలనేది ఆమె ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
2. బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ తగ్గని ప్రజాదరణ
తీవ్రమైన వివాదాలు ఎదురైనప్పటికీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు ఇప్పటికీ బలమైన ప్రజాభిమానం ఉంది. డిసెంబర్ 2024లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 57 శాతం మంది ప్రజలు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ అత్యంత అవసరమని పేర్కొన్నారు. అలాగే ఫిబ్రవరి 2026లో ప్రథమ్ ఆలో నిర్వహించిన సర్వేలో 25 శాతం మంది ప్రజలు అవామీ లీగ్‌పై నిషేధం విధించాలనే ప్రతిపాదనలను బహిరంగంగానే వ్యతిరేకించారు.
3. మతత్వ శక్తులపై పోరాటం, సెక్యులర్ ఇమేజ్
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎప్పుడూ లౌకికవాద నాయకురాలిగా గుర్తింపు పొందారు. బంగ్లాదేశ్‌లో మతతత్వ, తీవ్రవాద జమాత్ శక్తులకు వ్యతిరేకంగా ఆమె సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో జమాత్ శక్తుల వేధింపులు, ఆధిపత్యం బాగా పెరిగిపోయాయి. అవామీ లీగ్ పార్టీ ఈ అంశాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో ఆమె రాక ఆ వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
4. తారిఖ్ రెహమాన్ ప్రభుత్వ వైఫల్యాలు
హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేసి ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో బిఎన్‌పి విజయం సాధించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తారిఖ్ రెహమాన్ ఆ సవరణలను అమలు చేయలేదు. ప్రస్తుతం తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే పరిపాలన కొనసాగిస్తోంది. దీనిని అవామీ లీగ్ పెద్ద అవకాశంగా మలచుకుంది. తాను గతంలో చేసిన పనులు తప్పు కావని ప్రజలకు నిరూపించడానికే హసీనా మళ్లీ మైదానంలోకి దిగుతున్నారు.
5. అవామీ లీగ్ క్షీణతను అడ్డుకునేందుకు
హసీనా లేకపోవడంతో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ రోజురోజుకూ బలహీనపడుతోంది. ఒకవేళ ఆమె ఇప్పుడు తిరిగి రాకపోతే, రాబోయే రోజుల్లో అవామీ లీగ్ ఉనికి పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి అవామీ లీగ్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ చట్టాలు అమల్లోకి రాకముందే దేశంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని హసీనా ప్లాన్ చేస్తున్నారు.
6. ఆర్థిక సంక్షోభం, మందగించిన అభివృద్ధి
అవామీ లీగ్ నాయకుల ప్రకారం.. హసీనా ప్రభుత్వం మారిన తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధి తీవ్రంగా మందగించింది. విదేశీ పెట్టుబడిదారులు బంగ్లాదేశ్‌కు రావడానికి భయపడుతున్నారు. గత రెండేళ్లలో దేశంలోకి ఒక్క టాకా పెట్టుబడి కూడా రాలేదని చెబుతున్నారు. అంతేకాకుండా, భారతదేశంతో సంబంధాలు దెబ్బతినడం వల్ల బంగ్లాదేశ్‌కు ప్రధాన ఆదాయ వనరైన టెక్స్‌టైల్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితులన్నీ హసీనా తిరుగుబాటుకు అనుకూలంగా మారాయి.




