Donald Trump: యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌దా.? అస‌లు ల‌క్ష్యం ఏంటో చెప్పేసిన ట్రంప్

Donald Trump: ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం త్వరగా ముగిసేలా కనిపించడం లేదని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినా, అది సరిపోదని… మరింత శాశ్వతంగా ప్రభావం చూపే చర్యలు అవసరమని అన్నారు.

Mokshith
Published on: 18 March 2026 11:54 AM IST
Donald Trump
X

Donald Trump: యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌దా.? అస‌లు ల‌క్ష్యం ఏంటో చెప్పేసిన ట్రంప్ 

Donald Trump: ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం త్వరగా ముగిసేలా కనిపించడం లేదని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినా, అది సరిపోదని… మరింత శాశ్వతంగా ప్రభావం చూపే చర్యలు అవసరమని అన్నారు.

నష్టం శాశ్వతంగా ఉండాలి

వైట్ హౌస్‌లో మాట్లాడిన ట్రంప్ ఇప్ప‌టికిప్పుడు యుద్ధాన్ని ఆపేసినా.. ఇరాన్ తిరిగి కోలుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. కానీ భవిష్యత్తులో మరో అమెరికా అధ్యక్షుడు ఇదే సమస్యను ఎదుర్కోకూడదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అంటే, ఈ యుద్ధం కేవలం తాత్కాలికం కాదు… దీని ప్రభావం దీర్ఘకాలం ఉండాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

అణు బెదిరింపుపై స్ట్రాంగ్ రియాక్ష‌న్

ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు తయారు చేయకూడదనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. “అలాంటి ప్రమాదం మళ్లీ రాకూడదు” అని ఆయన అన్నారు. అణు ఆయుధాలు ప్రమాదకర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే పరిస్థితిని అసలు అనుమతించబోమని హెచ్చరించారు.

ఇప్పటివరకు జరిగిన దాడులు చాలా విజయవంతంగా ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి చేసిన దాడులతో ఇరాన్ సామర్థ్యం బలహీనపడిందని ఆయన అభిప్రాయం. ఇటీవల జరిగిన దాడులు “ఎవరూ ఊహించని ఫలితాలు ఇచ్చాయి” అని కూడా అన్నారు. ఈ యుద్ధంలో అమెరికా ముందంజలో ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

యుద్ధం ముగింపు ఎప్పుడు?

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ యుద్ధాన్ని మ‌రికొన్ని వారాలు కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే యుద్ధం త్వ‌ర‌గా ముగిసేలా లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

నాటోపై విమర్శలు…

ఈ సందర్భంలో ట్రంప్, NATO దేశాలపై కూడా విమర్శలు చేశారు. ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి రక్షణలో సహకరించాలన్న అమెరికా విజ్ఞప్తికి మిత్రదేశాలు ముందుకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక ఈ యుద్ధం కారణంగా అమెరికా విదేశాంగ విధానాలపై కూడా ప్రభావం పడుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే… ఇరాన్ యుద్ధం తక్షణం ముగిసేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Mokshith

Mokshith

Next Story