Trump Gold Coins: డోనాల్డ్ ట్రంప్ చిత్రంతో బంగారు నాణేలు.. ఎందుకంటే..
Trump Gold Coins: డోనాల్డ్ ట్రంప్ బంగారు నాణేలను విడుదల చేయాలనీ అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై యూఎస్ లో దుమారం రేగుతోంది.
Trump Gold Coins
Trump Gold Coins: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆ దేశ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో కూడిన బంగారు నాణేన్ని విడుదల చేయడానికి యోచిస్తోంది . ట్రంప్ చిత్రంతో కూడిన బంగారు నాణెం విడుదల అక్కడ పెద్ద వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో, ట్రంప్ చిత్రంతో కూడిన బంగారు నాణెం విడుదల గురించి తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి..
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడ పలు దూకుడు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులను దేశం నుండి బహిష్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై పన్నులు విధించడం, దేశాలపై సైనిక చర్య తీసుకోవడం వంటి పలు చర్యలు ఆయన తీసుకుంటున్నారు. ముఖ్యంగా, “అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాను” అని ప్రతిజ్ఞ చేసిన ట్రంప్, దీనిని సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం..
ప్రతి సంవత్సరం జూలై 4న అమెరికా తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలో, 2026 జూలై 4న అమెరికా తన 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుండగా, ట్రంప్ చిత్రపటం ప్రధాన ఆకర్షణగా ఉండే ఒక బంగారు నాణేన్ని విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది.
ట్రంప్ చిత్రం ఉన్న బంగారు నాణెంపై వివాదం
ట్రంప్ చిత్రం ఉన్న బంగారు నాణెం కేవలం స్మారక చిహ్నంగా మాత్రమే ఉంటుందని, ప్రజల వినియోగానికి కాదని అమెరికా పేర్కొంది. అయితే, అధికారంలో ఉన్న అధ్యక్షుల చిత్రాలను నాణేలపై ముద్రించడం అమెరికా సంప్రదాయం కాదు. ఈ నేపథ్యంలో, బంగారు నాణెంపై ప్రస్తుత ట్రంప్ చిత్రాన్ని ముద్రించడం అమెరికాలో పెద్ద రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది.
మొత్తంమీద ట్రంప్ ప్రతి పనిలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎవరు ఎన్నన్నా.. ఏమనుకున్నా తాను అనుకున్న పని చేసుకుంటూ పోయే డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన చిత్రంతో తేవాలనుకుంటున్న బంగారు నాణేలపై ఎంత వివాదం జరిగినా వెనక్కి తగ్గుతారని అనుకోలేం. కచ్చితంగా ముందడుగు వేసి తీరతారనేది ఆయన విధానాలు , పట్టుదల తెలిసిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




