Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చిన్నప్పటి ఇల్లు అమ్మకం.. ఎన్ని కోట్లు పలికిందో తెలిస్తే షాకే

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిన్నతనంలో నివసించిన నివాసం భారీ ధరకు అమ్ముడుపోయింది.

CR Reddy
Published on: 13 Sept 2026 6:54 AM IST
Donald Trump
X

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిన్నతనంలో నివసించిన నివాసం భారీ ధరకు అమ్ముడుపోయింది. న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ ఐకానిక్ భవనం గతంలో పాడైపోయిన స్థితి నుంచి ఆధునిక లగ్జరీ హౌస్‌గా మారి ఏకంగా 1.93 మిలియన్ డాలర్లకు విక్రయమవ్వడం విశేషం. న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో ఉన్న జమైకా ఎస్టేట్స్ లో ఈ అందమైన ట్యూడర్ శైలి ఇల్లు ఉంది. ట్రంప్ తండ్రి, ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఫ్రెడ్ ట్రంప్ 1940లో ఈ నివాసాన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించారు. డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల వయసు వరకు తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోనే పెరిగారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఇంటితో ట్రంప్ చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఈ ఆస్తి ట్రంప్ కుటుంబం చేతి నుంచి ఇతర యజమానుల వద్దకు మారిపోయింది.

అడవి పిల్లుల స్థావరం నుంచి ఆధునిక లగ్జరీ విల్లాగా

గతంలో కొన్నేళ్ల పాటు ఈ ఇల్లు ఎవరూ లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పైపులు పగిలిపోయి ఇల్లంతా నీటితో నిండిపోవడమే కాకుండా బూజు పట్టి ఘోరంగా తయారైంది. చివరకు అడవి పిల్లులు ఉండటానికి ఇదొక కేంద్రంగా మారింది. ఈ విషాదకర స్థితిని చూసి టామీ లిన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ గత సంవత్సరం దీనిని 835,000 డాలర్లకు కొనుగోలు చేశారు. ఎనిమిది నెలల పాటు శ్రమించి, మరో 500,000 డాలర్లు ఖర్చు చేసి, ఐదు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్న ఈ ఇంటిని ఆధునిక హంగులతో లగ్జరీ హోమ్‌గా మార్చేశారు.

చరిత్రలో అనేక మార్లు చేతులు మారిన ఆస్తి

ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన 2017లో ఈ భవనం 2.14 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అప్పట్లో ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసి పర్యాటకుల కోసం ఎయిర్‌బీఎన్‌బీ‎లో అద్దెకు ఇచ్చేది. సందర్శకులను ఆకట్టుకునేలా ట్రంప్ లైఫ్-సైజ్ కార్డ్‌బోర్డ్ కటౌట్‌లు, ఆయన రాసిన పుస్తకాలు, మ్యాగజైన్ కవర్లను అక్కడ ప్రదర్శనకు పెట్టేవారు. ఆ తర్వాత 2019లో 2.9 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినా సరైన కొనుగోలుదారులు దొరక్క ధర తగ్గుతూ వచ్చింది.

శుక్రవారం ముగిసిన చారిత్రక డీల్

అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లతో పాటు న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. శుక్రవారం ఈ ఇంటి విక్రయ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. ఒక అజ్ఞాత కొనుగోలుదారుడు దీనిని 1.93 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16 కోట్లకు పైగా) చెల్లించి సొంతం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన వేల కోట్లు గడించి వైట్ హౌస్ అధిపతిగా ఎదిగిన ట్రంప్ బాల్యపు ఇల్లు ఈ స్థాయి ధరకు విక్రయమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.