Congo Ebola Outbreak: కాంగోలో మళ్లీ ఎబోలా భయం.. వైరస్‌ను అదుపు చేయడం ఎందుకు కష్టమవుతోంది?

కాంగోలో ఎబోలా వ్యాప్తి వేగంగా పెరగడానికి కారణాలేంటి? అంతర్గత ఘర్షణలు, ప్రజల వలసలు, బలహీనమైన నిఘా వ్యవస్థ, వైద్య మౌలిక సదుపాయాల కొరత వైరస్ కట్టడికి ఎలా సవాలుగా మారుతున్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 4 Sept 2026 11:15 AM IST
Congo Ebola Outbreak: కాంగోలో మళ్లీ ఎబోలా భయం.. వైరస్‌ను అదుపు చేయడం ఎందుకు కష్టమవుతోంది?
X

Congo Ebola Outbreak: ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఎబోలా మహమ్మారి తీవ్రంగా చుట్టుముట్టింది. అధికారిక గణాంకాల ప్రకారం, మే నెల మధ్యలో ప్రారంభమైన ఈ ఉధృతిలో బాధితుల సంఖ్య 6,250 దాటగా, మరణాలు 3,039కి చేరాయి. కేవలం మూడు ఆరోగ్య ప్రాంతాలకే పరిమితమైన వైరస్, స్వల్ప కాలంలోనే 60 ప్రాంతాలకు వ్యాపించి విలయం సృష్టిస్తోంది. ఆఫ్రికా సీడీసీ సమర్పించిన సమాచారం ప్రకారం ఈ మహమ్మారి తీవ్రత ఇంకా తీవ్ర రూపం దాల్చాల్సి ఉంది.

వేగంగా వ్యప్తి చెందడానికి కారణాలు

ఈ వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి, మరణాల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. తూర్పు కాంగోలో నిరంతరం సాగే అంతర్గత యుద్ధాలు, సాయుధ ముఠాల ఘర్షణల వల్ల ప్రజలు నివాసాలు వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ విపరీతమైన జనాభా కదలికల వల్ల వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు, వ్యాధి సోకిన వారిని ప్రారంభంలోనే గుర్తించి, వారి కాంటాక్ట్ వివరాలను సేకరించే కమ్యూనిటీ నిఘా వ్యవస్థ ఇక్కడ చాలా బలహీనంగా ఉన్యాదని యు.ఎస్ సీడీసీ పేర్కొంది. ఇక, భయంతో వ్యాధి లక్షణాలను దాచడం, సకాలంలో ఆసుపత్రులకు రాకపోవడం వల్ల గత వారంలో నమోదైన మరణాల్లో దాదాపు 63 శాతం మరణాలు ఎబోలా చికిత్స కేంద్రాల వెలుపలే సంభవించాయి. ఈ కారణాల వలన ఆరు ప్రభావిత ప్రావిన్సుల్లో వైరస్ బారిన పడిన వారితో సంబంధం ఉన్న వ్యక్తులను వెతికి పట్టుకునే ప్రక్రియ దారుణంగా దెబ్బతింది.

మౌలిక సదుపాయాల కొరత

ఐసోలేషన్ వార్డుల్లో పడకల సంఖ్యను 1,300కు పెంచినప్పటికీ, కొత్తగా వెలుగుచూస్తున్న కేసులకు అవి సరిపోవడం లేదు. లాబొరేటరీల్లో పరీక్షలు చేసే సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల నమూనాల నిర్ధారణ ఆలస్యమవుతోంది. రెండవ అత్యధిక ప్రభావిత ప్రాంతమైన నార్త్ కివులోని పలు కేంద్రాల్లో రోగులను మెరుగైన ఆసుపత్రులకు తరలించే మార్గాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో కాంగో ఆరోగ్య అధికారులు గ్రామ స్థాయి పద్ధతిని అమలులోకి తెచ్చారు. గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తెచ్చి, అనుమానితులను ముందే గుర్తించేలా చర్యలు చేపడుతున్నారు. ఎబోలా సోకిన వ్యక్తుల రక్తం లేదా శారీరక ద్రవాల ద్వారా మాత్రమే కాక, చనిపోయిన వారి మృతదేహాల ద్వారా కూడా తీవ్రంగా వ్యాపిస్తుంది. అందువల్ల, అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story