China: చైనా మరో ఎత్తుగడ...భారత్‌ సరిహద్దుల్లో మరో కొత్త కారిడార్‌కు ప్లాన్‌

భారత్ సరిహద్దులకు సమీపంలో చైనా ప్రతిపాదించిన చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ దాని వ్యూహాత్మక ప్రాధాన్యం, భారత్‌కు ఉన్న భద్రతా సవాళ్లు తదితర అంశాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 3 July 2026 8:19 AM IST
China: చైనా మరో ఎత్తుగడ...భారత్‌ సరిహద్దుల్లో మరో కొత్త కారిడార్‌కు ప్లాన్‌
X

China: అంతర్జాతీయ రాజకీయ యవనికపై చైనా మరోసారి తన కుటిల నీతిని ప్రదర్శిస్తోంది. పశ్చిమ సరిహద్దుల్లో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా భారత్‌ను ఇబ్బంది పెడుతున్న బీజింగ్, ఇప్పుడు తూర్పు సరిహద్దులపై కన్నేసింది. ఒక దశాబ్దం క్రితం అటకెక్కిన పాత ప్రతిపాదనకు కొత్త రంగులు అద్దుతూ చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ అనే సరికొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన వ్యూహాత్మకంగా చర్చకు వచ్చింది.

ఏమిటీ కారిడార్? దీని వెనుక ఉన్న అసలు కథ?

గతంలో భారత్‌ను కూడా కలుపుకుంటూ బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ కారిడార్‌ను చైనా ప్రతిపాదించింది. అయితే, చైనా 'బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' వెనుక ఉన్న విస్తరణవాద ఎత్తుగడలను గమనించిన భారత్.. దీనికి దూరంగా ఉంది. దీంతో 2019లో చైనా ఈ ప్రాజెక్టును అధికారిక జాబితా నుండి తొలగించింది. ఇప్పుడు భారత్‌ను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం బంగ్లాదేశ్, మయన్మార్‌లను కలుపుతూ ఈ కొత్త మూడు దేశాల కారిడార్‌ను చైనా ప్రతిపాదిస్తోంది.

చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కునిమింగ్ నుండి ఈ కారిడార్ ప్రారంభమై, మయన్మార్‌లోని మాండలే మీదుగా రాఖైన్ రాష్ట్రంలోని క్యాక్‌ప్యూ లోతైన ఓడరేవుకు చేరుకుంటుంది. అక్కడి నుండి బంగ్లాదేశ్‌లోని చాట్టోగ్రామ్, కాక్స్ బజార్ ఓడరేవులను కనెక్ట్ చేస్తూ రోడ్డు, రైలు మార్గాలను నిర్మించాలన్నదే చైనా మాస్టర్ ప్లాన్.

యుద్ధ భూమిలో చైనా ప్రయాణం ... అసలు సవాలు ఇదే

కాగితం మీద ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధ వలయంలో ఉంది. చైనా నిర్మించాలనుకుంటున్న ఈ 1,700 కిలోమీటర్ల కారిడార్.. తీవ్ర అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రం గుండా వెళ్లాల్సి ఉంది. 2026 నాటి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నివేదికల ప్రకారం, ప్రస్తుతం మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం చేతిలో దేశంలోని 20 శాతం భూభాగం మాత్రమే ఉంది. మిగిలిన 42 శాతం తిరుగుబాటుదారుల చేతుల్లో, మిగతా భాగం నిరంతర ఘర్షణల మధ్య ఉంది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ స్పందిస్తూ.. రాఖైన్ రాష్ట్రంలో శాంతి స్థాపన జరిగితేనే ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని, ప్రస్తుతానికి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

చైనా ఎత్తుగడలు కేవలం వాణిజ్యం కోసమే కాదని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాన పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు ద్వారా అరేబియా సముద్రంలో అడుగుపెట్టిన చైనా, ఇప్పుడు తూర్పున బంగ్లాదేశ్ పోర్టుల ద్వారా బంగాళాఖాతంలో పట్టు సాధించాలని చూస్తోంది. భారత్‌ను రెండు వైపుల నుండి వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నంలో ఇదొక భాగం. ముఖ్యంగా ఈ కారిడార్ గనుక పూర్తయితే, ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో కలిపే 22 కిలోమీటర్ల అత్యంత కీలకమైన భూభాగం సిలిగురి కారిడార్ కు అతి సమీపంలోకి చైనా సైనిక రవాణా వ్యవస్థలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఈ ప్రతిపాదనను పరిశీలనలోనే ఉంచినప్పటికీ, చైనా తూర్పు కారిడార్ ఎత్తుగడలను భారత్ అత్యంత అప్రమత్తంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story