China Landslide : చైనాలో ప్రకృతి బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు.. 8 మంది మృతి, 34 మంది గల్లంతు
China Landslide : చైనాలో భారీ లాండ్‌స్లైడ్ సంభవించి పెను విషాదం నింపింది. కొండచరియలు విరిగిపడి నివాస భవనాలు మట్టికుప్పల కింద సమాధి కాగా.. 8 మంది మృతి చెందారు, 34 మంది గల్లంతయ్యారు.
China Landslide
China Landslide : చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. నైరుతి చైనాలోని ప్రముఖ నగరమైన చోంగ్‌కింగ్‌లో శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగి నివాస సముదాయాల పై పడ్డాయి. కొండపై నుంచి భారీ ఎత్తున బండరాళ్లు, మట్టి ఒక్కసారిగా కింద ఉన్న నివాస ప్రాంతాలపైకి దూసుకురావడంతో భారీ నష్టం వాటిల్లింది. క్షణాల వ్యవధిలోనే ఎన్నో ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు మట్టిదిబ్బలుగా మారిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది జాడ తెలియకుండా పోయింది. అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి ఇప్పటివరకు 1,100 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిద్రమత్తులోనే మృత్యుఒడిలోకి
చైనా ప్రభుత్వ అధికారిక ఛానెల్ సీసీటీవీ కథనం ప్రకారం.. పెంగుషుయ్ కౌంటీ పరిధిలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9:08 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తే లోపే ఇళ్లు మట్టి కింద సమాధి అయ్యాయి. సుమారు 10 కి పైగా పెద్ద నివాస భవనాలు మట్టిలో కూరుకుపోయాయి. శిథిలాల నుంచి రెస్క్యూ టీమ్స్ ఇప్పటివరకు 18 మందిని సురక్షితంగా బయటకు తీశాయి. అందులో పది మంది తీవ్రంగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 5 అంతస్తుల నుంచి 15 అంతస్తుల ఎత్తు గల రెండు భారీ నివాస భవనాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రంగంలోకి 800 మందికి పైగా సైనికులు
ప్రమాద తీవ్రత దృష్ట్యా అదనపు నష్టాన్ని నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. భూస్ఖలనం జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ పరిధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అలాగే పేలుళ్లు సంభవించకుండా ఉండేందుకు గ్యాస్, తాగునీటి కనెక్షన్లను కూడా కట్ చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో 800 మందికి పైగా విపత్తు నిర్వహణ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అధునాతన యంత్రాలతో మట్టిని తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. కొండ కింద మరికొన్ని భవనాలు ఉండటంతో సహాయక చర్యలు అత్యంత అప్రమత్తంగా సాగుతున్నాయి.
ఉన్నతాస్థాయి దర్యాప్తునకు అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశం
ఈ ఘోర ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడటమే ప్రథమ కర్తవ్యమని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ కొండచరియలు విరిగి పడడానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కోసం చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక సామాగ్రిని పంపింది. బాధితుల ఆశ్రయం కోసం దాదాపు 8 వేలకు పైగా అత్యవసర కిట్లను అక్కడికి చేర్చారు. ఇందులో తాత్కాలిక టెంట్లు, ఫోల్డింగ్ బెడ్లు, దుప్పట్లు, ఆహారపదార్థాలతో కూడిన ఫ్యామిలీ ఎమర్జెన్సీ కిట్లు ఉన్నాయి. గల్లంతైన 34 మంది కోసం రాత్రి పగలు తేడా లేకుండా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.




