Chile Giant Telescope: చిలీ ఎడారిలో భారీ టెలీస్కోప్... ఈసారైనా గ్రహాంతర జీవులను గుర్తిస్తారా?
చిలీ అటకామా ఎడారిలో నిర్మిస్తున్న భారీ టెలిస్కోప్ విశ్వ రహస్యాలను ఎలా ఛేదించబోతున్నదో తెలుసుకుందాం. విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా లేదా అన్నది కూడా త్వరలోనే తేలిపోతుంది.
Chile Giant Telescope: మానవాళి అంతరిక్ష అన్వేషణ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తూ, దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ అటకామా ఎడారిలో ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్ ఆకృతి దాలుస్తోంది. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ వినూత్న ప్రాజెక్టు పేరు ‘ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్’. నక్షత్ర మండలాలు, సుదూర విశ్వాన్ని అన్వేషించడమే కాకుండా... "విశ్వంలో మానవుడు ఒక్కడే ఉన్నాడా? లేదా గ్రహాంతర జీవులు ఉన్నాయా?" అనే యుగయుగాల ప్రశ్నకు ఈ టెలిస్కోప్ ద్వారా ఖచ్చితమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఈ బిగ్ సైన్స్ ప్రాజెక్టులోని ప్రధాన విశేషాలు, సాంకేతిక బలం, అంతరిక్ష పరిశోధనల విశ్లేషణల గురించి తెలుసుకుందాం.
పరిమాణంలో భవంతులతో పోటీ... మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్
అటకామా ఎడారిలోని సెర్రో అర్మాజోన్స్ పర్వతంపై 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రూపుదిద్దుకుంటున్న ఈ టెలిస్కోప్ పరిమాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 39 మీటర్ల అంటే 128 అడుగులు వెడల్పుగల ప్రధాన అద్దం ఇందులో అతి ముఖ్యమైనది. ప్రపంచంలో ఏ ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్‌కు లేనంత భారీ అద్దం దీని సొంతం. ఇది 798 చిన్న షడ్భుజి ముక్కలను అత్యంత ఖచ్చితత్వంతో జోడించి రూపొందించబడింది. 80 మీటర్ల అంటే 260 అడుగుల ఎత్తైన డోమ్ మరో ఆకర్షణ. 20 అంతస్తుల భవనం ఎత్తులో ఉండే ఈ నిర్మాణం కోసం పదివేల టన్నుల కాంక్రీట్, స్టీల్‌ను ఉపయోగించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అద్దం 6.5 మీటర్లు కంటే ఇది చాలా రెట్లు పెద్దది.
గ్రహాంతర జీవులను ఎలా గుర్తిస్తుంది?
ELT ద్వారా వేరే నక్షత్ర మండలాలు లేదా సుదూర ప్లానెట్స్పై ఉన్న వస్తువులను చూడలేకపోవచ్చు, కానీ జీవం ఉనికిని శాస్త్రీయంగా ఇది పసిగట్టగలుగుతుంది. సుదూర ఎక్సోప్లానెట్ వాతావరణంలో ప్రసరించే కాంతి స్పెక్ట్రమ్‌ను విశ్లేషించి, అక్కడ ఆక్సిజన్, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ లేదా సూక్ష్మజీవులు విడుదల చేసే ఆర్గానిక్ వాయువుల ఉనికిని కనుగొంటుంది. జేమ్స్ వెబ్ అందించే స్పష్టత కంటే స్పష్టమైన అంగుళార్ రిజల్యూషన్‌తో భూమి పరిమాణంలో ఉండే చిన్న గ్రహాల బరువు, సాంద్రతను ఖచ్చితంగా ఈ టెలిస్కోప్ లెక్కిస్తుంది.
అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు
వాతావరణంలోని ఆటంకాలను తట్టుకోవడానికి ఇది 'అడాప్టివ్ ఆప్టిక్స్' సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంటే, వాతావరణంలోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా టెలిస్కోప్ అద్దం క్షణాల్లో తన ఆకారాన్ని స్వల్పంగా మార్చుకుంటూ నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని స్పష్టంగా సేకరిస్తుంది. దీని ద్వారా మిల్కీ వే గెలాక్సీలోని అత్యంత పురాతన నక్షత్రాల వయస్సును, విశ్వం ఆవిర్భావ సమయానికి చెందిన గెలాక్సీలను అధ్యయనం చేయవచ్చు.
2030 నాటికి పూర్తి
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసుకుని 2030 డిసెంబర్ నాటికి తన మొదటి శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమయానికి అంతరిక్షంలో ఇతర గ్రహాల మీద సూక్ష్మజీవుల సంకేతాలు దొరికితే, మనం ఒంటరిగా ఉన్నామా లేదా అన్నది స్పష్టమౌతుంది. భూమిలాంటి గ్రహాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయన్నది వాస్తవం. అయితే, అవి మన గెలాక్సికి ఎంత దూరంలో ఉన్నాయి... ఎలా ఉన్నాయి...వాటితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అన్నది ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. విశ్వంలో భూమి ఒంటరిగా లేదు అని చెప్పడం కోసమే పరిశోధనలు జరుగుతున్నాయి.




