Brazilian Sisters: వృద్ధాప్యాన్ని జయించిన బ్రెజిల్‌ మహిళలు... శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

వందేళ్లకు జీవిస్తున్న బ్రెజిల్‌కి చెందిన ముగ్గురు మహిళలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీర్ఘాయుష్షుతో ఎలా జీవించాలనే దానిపై పరిశోధనలు కీలక అంశాలు వెలుగుచూశాయి.

Balachander
Published on: 25 Jun 2026 12:05 PM IST
Brazilian Sisters: వృద్ధాప్యాన్ని జయించిన బ్రెజిల్‌ మహిళలు... శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు
X

Brazilian Sisters: మానవ జీవితంలో వృద్ధాప్యం అనేది సహజం. వయసు పైబడే కొద్దీ శరీరం సహకరించకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం చూస్తూనే ఉంటాం. కానీ, బ్రెజిల్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వృద్ధాప్యాన్ని సవాల్ చేస్తూ, వందేళ్లు దాటినా అత్యంత ఆరోగ్యంగా జీవిస్తూ అంతర్జాతీయ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్నారు. బతికి ఉన్న ముగ్గురు తోబుట్టువుల అత్యధిక ఉమ్మడి వయసు కేటగిరీలో వీరు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సావోపాలో యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత జన్యుశాస్త్రవేత్త మాయానా జాట్జ్ నేతృత్వంలోని బృందం ‘డీఎన్‌ఏ లోంగేవో ప్రాజెక్ట్’ ద్వారా వీరిపై ప్రత్యేక పరిశోధనలు చేస్తోంది. వీరు ఇంత కాలం జ్ఞాపకశక్తి, శారీరక దారుఢ్యం కోల్పోకుండా ఎలా ఉన్నారనే రహస్యం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

శతాధిక సోదరీమణులు

ప్రపంచవ్యాప్తంగా వయసు రికార్డులను ధృవీకరించే ‘లోంగేవి క్వెస్ట్’ అనే సంస్థ ద్వారా ఈ ముగ్గురి వయసును అధికారికంగా లెక్కించారు. ముగ్గురిలో పెద్దవారైన లెవితా దే దేవుస్ నూన్స్ వయసు 109 సంవత్సరాలు. ఈమె గతంలో టెలివిజన్ నెట్‌వర్క్‌లో పనిచేశారు. ఇక నర్సింగ్‌లో రంగంలో పనిచేసి ఐదుగురు పిల్లలను పెంచి పెద్ద చేసిన జొరైడ్ దే దేవుస్ మోటా వయసు 104 సంవత్సరాలు. కుటుంబంలో చివరి సోదరైన జులినా... కుటుంబ సంరక్షణకే జీవితాన్ని అంకితం చేసుకున్నది. ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న జులినా దే దేవుస్‌ సూన్స్‌ మనోస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. వృద్ధాప్యాన్ని జయించిన జులినా వయసు 103 సంవత్సరాలు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఇంకా ఆరోగ్యంగా ఎవరిపై ఆధారపడకుండా, వృద్ధాప్యం కారణంగా వచ్చే మతిమరుపు లేకుండా జీవిస్తున్నారు. వీరిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ ముగ్గురితో పాటు వందేళ్లు బతికిన 500 మందిపై పరిశోధనలు చేయాలని, వారి డీఎన్‌ఏలను సేకరించి విశ్లేషించాలని అప్పుడే లంగ్‌లైఫ్‌కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు.

సీక్రెట్ ఏంటి? జన్యువులా.. జీవనశైలా?

శాస్త్రవేత్తల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం...మానవ శరీరాన్ని వృద్ధాప్య ప్రభావాల నుండి రక్షించే కొన్ని ప్రత్యేకమైన ‘ప్రొటెక్టివ్ జీన్స్’ వీరి శరీరంలో ఉన్నాయి. అయితే, కేవలం జన్యువులే కాదు, వీరి సుదీర్ఘ జీవితానికి కారణం నిరాడంబరమైన అలవాట్లేనని ఈ సోదరీమణులు చెబుతున్నారు. "మా చిన్నతనంలో ఫ్రిజ్‌లు లేవు, నదుల నుండి తెచ్చిన తాజా చేపలు, కూరగాయలు తినేవాళ్లం. నదుల్లో ఈత కొట్టేవాళ్లం" అని జులినా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కూడా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జొరైడ్ వివరించారు. నిత్యం చురుగ్గా ఉండటం, అందరూ కలిసి ఒకే చోట ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి వీరి ఆయుష్షు పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భవిష్యత్తులో రాబోయే తరాల వారికి వృద్ధాప్య ముడతలు, గుండె జబ్బులు రాకుండా కాపాడేందుకు ఈ ముగ్గురు బ్రెజిల్ వృద్ధ నారీమణుల డీఎన్‌ఏ ఒక అమృత భాండాగారంగా మారబోతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story