Escape Plan: అయ్యో.. జైలు నుంచి తప్పించుకోవడానికి కష్టపడి సొరంగం తవ్వాడు.. తీరా చూస్తే..
Escape Plan: జైలు నుంచి తప్పించుకోవాలని కష్టపడి సొరంగం తవ్వడానికి ప్రయత్నించినఖైదీ అందులో ఇరుక్కుపోయాడు. బ్రెజిల్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా.
Escape Plan
Escape Plan: కొన్ని సినిమాలు చూసినపుడు అసలు ఇది సాధ్యమా? అనిపిస్తుంది. ఇలా ఎవరైనా చేయగలరా అనే డౌట్ వస్తుంది. ఒక్కోసారి అలాంటి సీన్స్ చూసి దర్శకుల్ని ట్రోల్ కూడా చేస్తుంటారు. అయితే, నిజజీవితంలో అలాంటి సంఘటన జరిగింది అని తెలిసిన వెంటనే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. క్రైమ్ యాక్షన్ సినిమాల్లో చాలా దృశ్యాలు వాస్తవాలకు దూరంగా అనిపిస్తాయి. కానీ, కథ.. కథనంలో పడి వాటిలో చాలావాటిని మనం పట్టించుకోము. ముఖ్యంగా జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు చేసే పనులు సినిమాల్లో చాలా ఉంటాయి. అవన్నీ నిజంగా జరిగే ఛాన్స్ ఉండదని అనుకుంటాం. అలా అనుకోవడం పొరపాటే.. అనే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.
ఇదిగో ఇది కూడా అలాంటి సంఘటనే. కాకపోతే మన దేశంలో కాదు లెండి. బ్రెజిల్ లో జరిగింది. అక్కడ ఒక ఖైదీ ఐదేళ్ల పాటు కష్టపడి సొరంగం తవ్వాడు. తప్పించేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ. ఏమైందంటే..
బ్రెజిల్ లోని ఒక జైలులో ఖైదీ ఐదేళ్ల పాటు కష్టపడి ఒక సొరంగం తవ్వాడు. జైలు నుంచి బయటపడాలని విపరీతమైన ప్రయత్నం చేశాడు. చాలావరకూ దానిలో విజయం సాధించాడు . అయితే , అతని అదృష్టం తిరగబడింది. అతను చేసిన సొరంగం నేరుగా అదే జైలులోని సెక్యూరిటీ రూమ్ కి అతన్ని చేర్చింది. మనోడు హమ్మయ్య బయట పడిపోయాను అనుకుంటూ చూసేటప్పటికి ఎదురుగా జైలు అధికారులు.. సిబ్బంది నవ్వుతూ అతనికి స్వాగతం పలికారు. దీంతో మనోడి పథకం బెడిసి కొట్టి మళ్ళీ అదే జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన బ్రెజిల్ జైలులోని సెక్యూరిటీ పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. దీనిపై ప్రస్తుతందర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ఈ జైలులో ఇది మొదటిసారి కాదు . కొన్నేళ్ల క్రితం కూడా ఒక ఖైదీ తప్పించుకోవడానికి సొరంగం తవ్వి విఫల ప్రయత్నం చేశాడు. ఆ ఖైదీ.. ఇతనూ . . ఒక్కరేనా అనేది తెలియరాలేదు. అప్పట్లో అంతర్జాతీయ పత్రిక మెట్రోలో వచ్చిన కథనం ప్రకారం.. బ్రెజిల్ లో ఒక నేరస్థుడు జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అలాన్ లియాండ్రో డా సిల్వా(32) ఐదేళ్లు కష్టపడి జైల్లో ఒక సొరంగం తవ్వుతూ పోయాడు. అయితే, ఈ క్రమంలో అతను జైలు గోడలు దాటలేకపోయాడు. అతను తవ్విన సొరంగంలో చిక్కుకుపోయాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అతన్ని జైలు అధికారులు రక్షించి హాస్పిటల్ కు చేర్చారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. గార్డులు పరధ్యానంలో ఉన్నప్పుడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, రంధ్రం పరిమాణాన్ని తప్పుగా అంచనా వేశాడు. వార్డెన్లు సెల్‌లో అసాధారణ కదలికను గమనించిన తర్వాత అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. అప్పటి నుండి వైరల్ అయిన ఒక వీడియోలో, అలాన్ తన మొండెం సెల్‌లోకి వేలాడుతూ, కుర్చీపై ఆనించి ఉన్నట్లు కనిపిస్తుంది, అత్యవసర సిబ్బంది మరింత గాయపడకుండా ఉండటానికి అతని చుట్టూ జాగ్రత్తగా డ్రిల్లింగ్ చేస్తున్నట్లు కనిపించింది.
తప్పించుకోవడంలో విఫలమై, స్వల్ప గాయాలపాలైనప్పటికీ, ఖైదీ చివరికి క్షేమంగా బయట పది ఆసుపత్రి పాలయ్యాడు. మరోవైపు జైలులో ఎటువంటి నిర్మాణ నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.
"ఖైదీ కథనం ప్రకారం, ఐదు రోజుల పాటు మేకు, చీపురు కర్రను ఉపయోగించి ఆ గొయ్యిని తవ్వారు. అయితే, తప్పించుకునే ప్రయత్నంలో, అతను ఆ రంధ్రం లోపల చిక్కుకున్నాడు. పరిస్థితిని గమనించిన జైలు అధికారులు, క్రిమినల్ పోలీసులు అగ్నిమాపక విభాగానికి ఫోన్ చేసి రక్షించారు" అని అగ్నిమాపక శాఖ ప్రతినిధి ది మెట్రోకు వివరించారు.




