Israel Lebanon War : శాంతి ఒప్పందాలు జరిగినా ఆగని క్షిపణుల వర్షం.. అసలు బెంజమిన్ నెతన్యాహు మైండ్ గేమ్ ఏంటి?

Israel Lebanon War : మిడిల్ ఈస్ట్‌లో శాంతి ఒప్పందాలు జరిగినా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. బెంజమిన్ నెతన్యాహు గ్రేటర్ ఇజ్రాయెల్ మిషన్‌లో భాగంగానే సరిహద్దులను విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

CR Reddy
Published on: 22 Jun 2026 6:04 AM IST
Israel Lebanon War
X

Israel Lebanon War

Israel Lebanon War : పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 40 రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం ఒక కీలక శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ పీస్ డీల్ జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జాతీయ రక్షణ మంత్రి ఇతమార్ బెన్ గ్వీర్ మాట్లాడుతూ.. "ట్రంప్ అంగీకరించినా, అంగీకరించకపోయినా తాము దక్షిణ లెబనాన్పై నియంత్రణను వదులుకోబోమని, తమ దేశ రక్షణ కోసం లెబనాన్‌ను పూర్తిగా తగలబెట్టడానికైనా సిద్ధమే" అని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందిస్తూ, ఇజ్రాయెల్ పాలకులు మానవాళికే ముప్పుగా మారారని మండిపడ్డారు.

అసలు ఏంటి ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ మిషన్?

అంతర్జాతీయ చట్టాలను, మిత్రదేశాల హెచ్చరికలను పక్కనబెట్టి నెతన్యాహు ఇంతలా తెగబడటం వెనుక గ్రేటర్ ఇజ్రాయెల్ లేదా ప్రామిస్డ్ ల్యాండ్ అనే ఒక పెద్ద వ్యూహం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ (2025)లోనే వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో దాదాపు 1 బిలియన్ డాలర్ల వ్యయంతో భారీ వసతుల ప్రాజెక్టును ఇజ్రాయెల్ ఆమోదించింది. "భవిష్యత్తులో స్వతంత్ర ఫిలిస్తీన్ దేశమనేదే ఉండదు, ఈ భూమి పూర్తిగా మాదే" అని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటించారు. ఈ అజెండా ప్రకారమే ఇజ్రాయెల్ తన సరిహద్దులను విస్తరించే పనిలో పడింది.

నెతన్యాహు టార్గెట్ లోని అరబ్ దేశాల జాబితా

గ్రేటర్ ఇజ్రాయెల్ ఊహాత్మక మ్యాప్ ప్రకారం.. ప్రస్తుత ఫిలిస్తీన్ (గాజా, వెస్ట్ బ్యాంక్) ప్రాంతాలను పూర్తిగా తుడిచిపెట్టి ఇజ్రాయెల్‌లో విలీనం చేస్తారు. దీనితో పాటు పొరుగున ఉన్న జోర్డాన్, లెబనాన్ దేశాలతో పాటు సిరియాలోని మెజారిటీ ప్రాంతాలను (ముఖ్యంగా గోలన్ హైట్స్) ఆధీనంలోకి తెచ్చుకోవడం వీరి లక్ష్యం. అంతేకాకుండా ఇరాక్ లోని కొన్ని భాగాలు, ఈజిప్ట్ లోని సినాయ్ ద్వీపకల్పం, సౌదీ అరేబియాకు చెందిన వాయువ్య భూభాగాలను కూడా ఈ సామ్రాజ్యంలో కలపడం నెతన్యాహు అంతర్గత వ్యూహంగా ప్రచారం జరుగుతోంది.

ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పై ఇజ్రాయెల్ పంజా

ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ కల నెరవేరాలంటే తమకు ప్రధాన శత్రువుగా ఉన్న ఇరాన్ మద్దతు గల ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమిని, ముఖ్యంగా లెబనాన్కు చెందిన హిజ్బుల్లాను పూర్తిగా నిర్వీర్యం చేయాలని నెతన్యాహు భావిస్తున్నారు. హిజ్బుల్లా బలంగా ఉన్నంతవరకు ఇజ్రాయెల్ తన ఉత్తర సరిహద్దులను విస్తరించలేదు. అందుకే శాంతి ఒప్పందాల పేరుతో ఇరాన్‌ను కాసేపు శాంతింపజేసి, అదే సమయంలో లెబనాన్పై ముప్పేట దాడులు చేయడం ఇజ్రాయెల్ వ్యూహాత్మక ఎత్తుగడ. నెతన్యాహు ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానాల తీర్పులను గానీ, ప్రపంచ దేశాల విమర్శలను గానీ అస్సలు కేర్ చేయడం లేదు. చరిత్రలో ఒక అజేయమైన నాయకుడిగా నిలిచిపోవాలనే పట్టుదలతోనే ఆయన ఈ యుద్ధాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story