Amazon: 4500 ఏళ్లనాటి వ్యవసాయం ... ఆథునిక ఫార్మింగ్‌కు సవాల్ చేస్తున్న అమెజాన్ రైతులు
అమెజాన్ అడవుల్లో 4,500 ఏళ్లుగా కొనసాగుతున్న చాగ్రా వ్యవసాయ విధానం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. రసాయనాలు లేకుండా సాగు, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత, గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారంగా నిలుస్తున్న ఈ వ్యవసాయ పద్దతులను తెలుసుకుందాం.
Amazon: ప్రపంచవ్యాప్తంగా రసాయన ఎరువులు, పురుగులమందుల వాడకంతో పర్యావరణం కలుషితమవుతున్న వేళ, అమెజాన్ అడవుల్లోని స్థానిక తెగలు అందిస్తున్న ఒక సాంప్రదాయ సాగు పద్ధతి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఐదేళ్ల సాగు తర్వాత తిరిగి ఆ భూమిని అడవికే అప్పగించే 'చాగ్రా' వ్యవసాయ విధానం.. ఆధునిక పారిశ్రామిక వ్యవసాయానికి సరికొత్త పాఠాలు నేర్పుతోంది. 4,500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పర్యావరణ అనుకూల పద్ధతి ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, అంతర్జాతీయ మైనింగ్ మాఫియా, ప్రాంతీయ రాజకీయాల నడుమ మనుగడ కోసం పోరాడుతోంది. తమ పద్దతులను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అడవితల్లిని బతికించుకుంటేనే ప్రపంచం బాగుంటుందని చెబుతున్నారు.
పర్యావరణ సమతుల్యత ... గణాంకాలు
కొలంబియా, ఈక్వెడార్ సరిహద్దుల్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో వ్యాపించి ఉన్న సుమారు 30 స్వదేశీ తెగలకు చెందిన 240కి పైగా కుటుంబాలు ఈ చాగ్రా విధానంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ ఒక్కో సాగుభూమి వైశాల్యం 2 హెక్టార్లు మించదు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఈ చాగ్రా తోటలలో కేవలం వాణిజ్య పంటలే కాకుండా దాదాపు 104 విభిన్న వృక్ష జాతులు సహజీవనం చేస్తున్నాయి. కేవలం ప్రధాన ఆహారమైన 'కసవా'లోనే 67 రకాలు ఇక్కడ పండిస్తారు. ఈ పద్ధతి ద్వారా సాధారణ ఏకపంట సాగుతో పోలిస్తే అత్యధికంగా కార్బన్‌ను భూమిలోనే నిక్షిప్తం చేయవచ్చు. ఈక్వెడార్‌లోని 'నాపో' ప్రాంతంలో దాదాపు 24,000 హెక్టార్లలో విస్తరించిన ఈ తరహా చాగ్రా తోటల ద్వారా స్థానిక రైతులకు 40% నుండి 60% వరకు ఆదాయం లభిస్తోంది. అక్కడి 'కల్లారి' కోఆపరేటివ్ సంస్థ అంతర్జాతీయంగా ఆర్గానిక్ కోకోను విక్రయిస్తూ ఏడాదికి 2 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 16 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.
అంతర్జాతీయ రాజకీయాలు ... ఎదురవుతున్న సవాళ్లు
ఐక్యరాజ్యసమితి సైతం దీనిని ప్రపంచ వారసత్వ వ్యవసాయ వ్యవస్థగా గుర్తించినప్పటికీ, గ్లోబల్ మార్కెట్ శక్తులు, స్థానిక అక్రమ మైనింగ్ వల్ల ఈ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో జరుగుతున్న బంగారం తవ్వకాలు, దానివల్ల పెరుగుతున్న మెర్క్యూరీ కాలుష్యంపై 2025లో కొలంబియా సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ కంపెనీలు స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, ఈ చాగ్రా సాగు ప్రాంతాలను "అడవుల నరికివేత" గా తప్పుగా వర్గీకరించడం అంతర్జాతీయ కార్పొరేట్ రాజకీయాలకు అద్దం పడుతోంది. దీనిపై 2024లో కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు స్థానిక తెగల హక్కులను కాపాడింది.
గ్లోబల్ సప్లై చైన్‌లపై ఆధారపడి ఆహార భద్రతను ప్రమాదంలో పడేసే కంటే, స్థానిక పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో చాగ్రా విధానం నిరూపిస్తోంది. ప్రపంచ దేశాలు కార్పొరేట్ లాభాల కోసం అడవులను నరికే గ్లోబల్ ట్రెండ్‌ను పక్కనబెట్టి, ఈ 4500 ఏళ్ల నాటి సుస్థిర నమూనా నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాగ్రా వంటి వ్యవసాయ విధానాలను మనదేశంలో కూడా అమలు చేస్తే పర్యావరణంతో పాటు పోషకాలు కలిగిన ఆహారం ప్రజలకు అందుతుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఇది ఎంతో ఉపయోగం అవుతుంది.




