US Attacks on Iran During Talks: ఇది కొత్త చరిత్ర కాదు...చర్చలు అంటూనే ఇప్పటి వరకు ఏడుసార్లు దాడులు
దౌత్యం పేరుతో చర్చలు జరుపుతూనే...దాడులు చేయడం అమెరికా వ్యూహంలో ఒకభాగం. ఇరాన్ విషయంలోనూ ఇదే పంధాను అనుసరించింది.
US Attacks on Iran During Talks: అమెరికా దౌత్యరంగాన్ని పరిశీలిస్తే... ఏ దేశంతో అయినా ఒకటే శైలిని అనుసరిస్తుంది. ఒకచేత్తో చర్చల ప్రతిపాదన...మరో చేత్తో మిలటరీ దాడులు... ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు మొత్తం ఏడుసార్లు చర్చల ముసుగులోనే దాడులు చేసింది. ఇరాన్ అంశం తెరమీదకు వచ్చేసరికి 73 ఏళ్లుగా ఇదే తంతు. 1953 నుంచి ఇలాగే చేస్తున్నది. నమ్మంచి గొంతు కోయడం లేదా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవడం అమెరికాకు వెన్నతోపెట్టిన విద్య. ఒకసారి చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే...
చరిత్రలో అమెరికా చేసిన దాడులు
చమురు జాతీయీకరణ వివాదంపై ఇరుదేశాల మధ్య రాజకీయ చర్చలు నడుస్తుండగానే, నాటి ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాద్దెగ్‌ను గద్దె దించడానికి అమెరికా సీఐఏ 1953లో తిరుగుబాటు కుట్ర చేయించింది. ఆ తరువాత 1980లో ఆపరేషన్ ఈగల్ క్లా పేరుతో దాడులు చేసింది. టెహ్రాన్‌లో అమెరికా రాయబారుల విడుదల కోసం ఒకవైపు దౌత్య చర్చలు సాగుతుండగానే అమెరికా సైన్యం రహస్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇరాక్ ఇరాన్ యుద్ధం సమయంలో దౌత్య ప్రక్రియ నడుస్తున్న సమయంలో ఇరాన్ చమురు నిల్వలు, నౌకలపై అమెరికా 1987-88లో ఆపరేషన్ నింబుల్ ఆర్చర్, ప్రేయింగ్ మాంటిస్ పేరుతో దాడులు చేసింది. అంతేకాదు, 2020లో అణు ఒప్పందంపై ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలో ఇరాన్‌లోనే అత్యంత శక్తివంతమైన జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా తన డ్రోన్‌తో హతమార్చింది.
2025లో అణు చర్చల కోసం డోనాల్డ్ ట్రంప్ విధించిన 60 రోజుల గడువు ముగియగానే...బీ2 బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో భారీ దాడులకు తెగబడింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఉమ్మడిగా జరిపిన జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సైనిక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ చర్చల నుంచి పూర్తిగా తప్పుకుంది. తాజాగా మే 25న ఇరాన్‌తో కాల్పుల విరమణ, సరికొత్త ఒప్పందంపై చర్చలు సాగుతుండగానే... హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ మిస్సైల్ కేంద్రాలు, నౌకలపై అమెరికా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఇలా చరిత్రలో మొత్తం ఏడుసార్లు చర్చలు జరుగుతుండగానే దాడులకు తెగబడింది.
దీంతో శాంతి చర్చలు అనేవి కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి అమెరికా వేసే ఒక ముసుగు మాత్రమేనని ఇరాన్ నమ్ముతోంది. చర్చల మేజాపై కూర్చుని కూడా శత్రువు బలహీనతలను పసిగట్టడం, సరైన సమయం చూసి దెబ్బతీయడం అమెరికా సైనిక వ్యూహంలో భాగం. ఈ ఏడు దాడుల చరిత్రను గమనిస్తే, అమెరికాను నమ్మి ఇరాన్ శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. ఖతార్‌లో జరుగుతున్న ఈ శాంతి చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.




