Gunfire : తోటలో పని చేసుకుంటున్న కార్మికులపై తూటాల వర్షం.. 25 మంది స్పాట్ డెడ్

Gunfire : హోండూరస్ దేశంలో సాయుధ దుండగులు జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ఆరుగురు పోలీసులు సహా కనీసం 25 మంది మరణించారు. తోటలో పని చేసే కూలీలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.

CR Reddy
Published on: 22 May 2026 7:54 AM IST
Honduras
X

Honduras

Gunfire : మధ్య అమెరికా దేశమైన హోండూరస్‌లో సాయుధ దుండగులు ఘోర ఘాతుకానికి ఒడిగట్టారు. గురువారం తీరప్రాంత పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు సహా కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ ముఠాల ఆధిపత్య పోరుతో పాటు దశాబ్దాలుగా నడుస్తున్న భూవివాదాలే ఈ ఘోర నరమేధానికి కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కాల్పులు జరిగి పెద్ద సంఖ్యలో జనం చనిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి ఘోర ఉదంతం ఉత్తర హోండూరస్‌లోని ట్రుజిల్లో మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంలో చోటుచేసుకుంది. తోటలో కూలీలు పని చేసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన కొందరు సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా 19 మంది కార్మికులు అక్కడికక్కడే బుల్లెట్లకు బలయ్యారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి యూరి మోరా వెల్లడించారు. ఈ ప్రాంతం సహజ వనరులకు నిలయమే కాకుండా, భూ హక్కుల కోసం గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ తీవ్రమైన ఘర్షణలు నడుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం, భూముల కోసం పోరాడే ఉద్యమకారులకు ఈ ప్రాంతంలో ప్రాణరక్షణ కరువైందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్రుజిల్లో ఘటన మరువక ముందే గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో ఉన్న కోర్టెస్ డిపార్ట్‌మెంట్‌లోని ఒమోవా మునిసిపాలిటీలో రెండో దారుణం జరిగింది. రాజధాని టెగుసిగాల్పా నుంచి యాంటీ గ్యాంగ్ మిషన్‌లో భాగంగా ఒమోవాకు ప్రయాణిస్తున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు మెరుపుదాడికి దిగారు. ముఠా సభ్యులు జరిపిన ఈ ఘోర కాల్పుల్లో ఒక సీనియర్ పోలీసు అధికారితో పాటు మొత్తం ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే సరిహద్దు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్రుజిల్లో తోటలో జరిగిన ఊచకోతలో ఖచ్చితమైన మరణాల సంఖ్యను లెక్కించడం మొదట్లో పోలీసులకు కష్టంగా మారింది. కాల్పులు జరిగిన వెంటనే భయాందోళనకు గురైన బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలం నుంచి తమ వారి మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లిపోవడమే దీనికి కారణమని జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరాహోనా తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు, ప్రాసిక్యూటర్లతో కూడిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలాలకు పంపామని, పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రకృతి వనరులను, భూములను కాపాడుకునేందుకు పోరాడే పర్యావరణవేత్తలకు హోండూరస్ దేశం అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారిందని గ్లోబల్ విట్నెస్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 2024 లో ఐదుగురు, అంతకుముందు ఏడాది ఏకంగా 18 మంది పర్యావరణ ఉద్యమకారులు ఇక్కడ దారుణ హత్యకు గురయ్యారు. 2024 లో పర్యావరణ నాయకుడు జువాన్ లోపెజ్ హత్య దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సూత్రధారులైన ముగ్గురిని ఇటీవల అరెస్ట్ చేయడం విశేషం. మిలిటరీ పర్యవేక్షణ ఎక్కువగా ఉన్నప్పటికీ, నేరగాళ్లకు శిక్షలు పడే రేటు ఇక్కడ చాలా తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

గ్యాంగ్‌స్టర్ల దాడులు, అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల నెట్‌వర్క్‌తో హోండూరస్ దేశం దశాబ్దాలుగా సతమతమవుతోంది. నేరాలను అదుపు చేయడానికి ప్రభుత్వం సైనిక బలగాలకు అపరిమిత అధికారాలు ఇస్తూ కొన్ని రాజ్యాంగ హక్కులను రద్దు చేసింది. మూడేళ్ల పాటు అమలులో ఉన్న ఈ అత్యవసర స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ చట్టం 2026 జనవరిలోనే ముగిసింది. ఆ కఠిన నిబంధనలు ముగిసిన కొద్ది నెలల్లోనే ఇంత పెద్ద స్థాయిలో సాయుధ ముఠాలు రెచ్చిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సైనిక విధానాల వల్ల అక్కడ టార్చర్లు, బలాత్కారాలు జరుగుతున్నాయని గతంలో అంతర్జాతీయ సంఘాలు విమర్శించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నేరగాళ్లు మళ్లీ పంజా విసురుతున్నట్లు స్పష్టమవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story