Vikarabad: కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న బీఆర్ఎస్ నేత
Vikarabad: వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డి. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం.
Vikarabad: కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న బీఆర్ఎస్ నేత
వికారాబాద్: కాక్రవేణి నదిలో అక్రమ ఇసుక రవాణా ఇష్టం వచ్చినట్లు సాగుతున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండల యాలాల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ శివారులోని కాక్రావేణి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. నదిలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారంటూ
ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
కాక్రవేణి నది పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల కళ్లముందే ఇసుక తరలింపు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యాలాల్ మండలంలోని కొంతమంది ప్రముఖ నాయకులకు ముడుపులు చెల్లిస్తూ ఇసుక అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
కాక్రవేణి నది నుంచి ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని, సంబంధిత అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.




