Shamshabad: వియత్నాం విషాదంలో బాధిత కుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం

Shamshabad: వియత్నాం ఘోర పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన ముగ్గురు బాధితుల పార్థివ దేహాలు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 July 2026 6:12 AM IST
Shamshabad
X

Shamshabad: వియత్నాం విషాదంలో బాధిత కుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం

Shamshabad: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతుల పార్థివ దేహాలు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. కడప జిల్లాకు చెందిన శ్రీథర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ మృతదేహాలను ముంబైలో అన్ని అంతర్జాతీయ, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి ఆవేదనను పంచుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు గౌరవప్రదంగా తరలించే ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

హైదరాబాద్ నుంచి కడప, మచిలీపట్నం, హిందూపురం ప్రాంతాలకు పార్థివ దేహాలను తరలించేందుకు ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, APNRTS ప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆపద వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి APNRTS నిరంతరం పనిచేస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలను వేగంగా అమలు చేస్తోందని చెప్పారు...

గతంలో హాంకాంగ్ విమానాశ్రయంలో పాస్‌పోర్టులు పోగొట్టుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో తక్షణ సహాయం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే నేపాల్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడ చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత కూడా APNRTSకే దక్కిందన్నారు.

వియత్నాం ప్రమాదం జరిగినప్పటి నుంచి బాధితుల సమాచారం సేకరణ, విదేశీ అధికారులు, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం, మృతదేహాల రప్పింపు, కుటుంబ సభ్యులకు సహాయం వంటి ప్రతి దశలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించిందని మంత్రి తెలిపారు.

విదేశాల్లో నివసిస్తున్న లేదా పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన ప్రతి సందర్భంలో APNRTS ద్వారా వేగవంతమైన సహాయక చర్యలు కొనసాగుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story