Vanasthalipuram: డీ-అడిక్షన్ సెంటర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
Vanasthalipuram: వనస్థలిపురం డీ-అడిక్షన్ సెంటర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందిన గంజి నాగార్జున. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Vanasthalipuram: డీ-అడిక్షన్ సెంటర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
వనస్థలిపురం: మద్యానికి బానిసై చికిత్స కోసం డీ-అడిక్షన్ సెంటర్‌లో చేరిన ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీకి చెందిన గంజి నాగార్జున (37) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనలో సత్ప్రవర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు గురుద్వార్ రోడ్డు మార్గంలోని సంకల్ప్ డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పించారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 14న ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో నాగార్జున బెడ్‌పై పడుకుని ఉండగా ఎంతకీ లేవలేదు. దీంతో డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని నాగార్జునను సమీపంలోని ప్రాగ్మా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే నాగార్జున మృతి చెందినట్లు ఆసుపత్రి డ్యూటీ వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగార్జున మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.




