Ghatkesar: ఘట్‌కేసర్‌లో న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ దాడి.. ఇద్దరు అరెస్ట్!
Ghatkesar: ఘట్‌కేసర్‌లోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి గడువు తీరిన ఆహార పదార్థాలు, కుళ్లిన గుడ్లను సీజ్ చేశారు.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ దాడి.. ఇద్దరు అరెస్ట్!
ఘట్‌కేసర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. బేకరీలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
బేకరీలోని గడువు తీరిన ఫుడ్ కలర్, 30 ప్యాకెట్ల హాట్ చిల్లీ, కిలో ఐసింగ్ షుగర్, 5 కిలోల మఫిన్ మిక్స్ పౌడర్, 5 కిలోల కొబ్బరి తురుము, 10 ట్రేల గడువు తీరిన గుడ్లు, బ్రెడ్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. కేకులు, ఎగ్ పఫ్స్ తయారీకి వినియోగించే పలు రకాల సింథటిక్ ఫుడ్ కలర్స్, వనస్పతి, ఇతర ముడి పదార్థాలను సీజ్ చేశారు.
ఈ వ్యవహారంలో బేకరీ సూపర్‌వైజర్ షేక్ నజీర్ బాషా (22), యజమాని షేక్ అక్బర్ (35)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘట్‌కేసర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బేకరీ ఉండటంతో ప్రయాణికులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో గడువు తేదీ, నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించాలని పోలీసులు సూచించారు.




