Uppal: బురదమయంగా ఉప్పల్ బస్‌స్టాండ్.. కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు!

Uppal: ఉప్పల్ నల్లచెరువు తాత్కాలిక బస్‌స్టాండ్‌లో బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. జేసీబీతో వెలికితీత.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు.

KARUNAKAR, UPPAL
Published on: 3 Aug 2026 5:53 PM IST
Uppal
X

Uppal: బురదమయంగా ఉప్పల్ బస్‌స్టాండ్.. కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు!

ఉప్పల్: ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌ వర్షాలతో పూర్తిగా బురదమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సోమవారం తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది.

ఈ ఘటనతో తాత్కాలిక బస్‌స్టాండ్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితి మరోసారి బట్టబయలైంది. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో మూడు నెలలుగా జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల స్టాప్‌ను నల్లచెరువు కట్ట సమీపానికి తాత్కాలికంగా తరలించారు.

ప్రస్తుతం వరంగల్, జనగాం, తొర్రూరు, యాదాద్రి తదితర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ఇదే బస్‌స్టాండ్‌ను వినియోగిస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షం కురిసినా బస్‌స్టాండ్‌ మొత్తం బురదతో నిండిపోతోంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు బురదలోనే నడుచుకుంటూ బస్సులు ఎక్కాల్సి వస్తోందని, జారిపడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"పొలంలో నాట్లు వేసే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు బస్‌స్టాండ్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది" అంటూ పలువురు వాపోతున్నారు. ప్రయాణికులే కాదు, ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది కూడా ఇదే సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదలో బస్సులు కూరుకుపోవడంతో సర్వీసులు సైతం ప్రభావితమవుతున్నాయి.

అయినప్పటికీ సమస్య అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సులు కూరుకుపోయినా, వేలాది మంది ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బస్‌స్టాండ్‌లో పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించి, కంకర లేదా పేవర్‌ బ్లాకులు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది వినియోగిస్తున్న ఈ తాత్కాలిక బస్‌స్టాండ్‌ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story