Uppal: ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అవినీతి లక్షల్లో లంచాలు!

Uppal: ఉప్పల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా భారీ వసూళ్లు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు.

KARUNAKAR, UPPAL
Published on: 1 Sept 2026 10:21 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అవినీతి లక్షల్లో లంచాలు!

Uppal: ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు జరుగుతున్నాయని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కూడా డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు డాక్యుమెంట్‌ రైటర్లకు ఎంత చెల్లిస్తున్నారు..? ఆ మొత్తంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఎంత వెళ్తోంది..? అనే అంశాలపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

పీర్జాదిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సర్వే నంబర్లు 39, 43, 44లోని ఓ ప్లాట్‌ అర్బన్ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ)లో చూపిస్తున్నప్పటికీ రూ.2 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆయన ఆరోపించారు. అదే అపార్ట్‌మెంట్‌ లోని మరో ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లగా, గతంలో పొరపాటున రిజిస్ట్రేషన్‌ చేశామని, ఇప్పుడు చేయలేమని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లంచాల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఈ దందా సాగుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు నెల నెల వాటాలు వెళ్తున్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని కోరారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ ప్రజల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నారగోని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఉప్పల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతిపై చర్యలు తీసుకోకపోతే కార్యాలయాల ఎదుట తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story