Uppal: సొంత భవనం లేక ఉప్పల్ ఎక్సైజ్ అధికారుల అవస్థలు

Uppal: సొంత భవనం లేక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 16 July 2026 8:17 AM IST
Uppal
X

Uppal: సొంత భవనం లేక ఉప్పల్ ఎక్సైజ్ అధికారుల అవస్థలు

ఉప్పల్: సొంత భవనం లేకపోవడంతో ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా అద్దె భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్న ఈ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలనే విధానంతో అద్దె చెల్లింపులు ఆగిపోవడంతో, ప్రస్తుతం ఉన్న భవనం యజమాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ భవనం కోసం ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ అంశాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అప్పగించినప్పటికీ, ఇప్పటివరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయ భవనం కేటాయింపుపై స్పష్టత రాలేదు.

ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సొంత భవనం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. "అయితే ఆ హామీ కార్యరూపం దాల్చలేదు."

పార్కింగ్ లేదు.. మౌలిక వసతుల కొరత.. ట్రాఫిక్ ఇబ్బందులు

ప్రస్తుతం ఉన్న అద్దె భవనంలో పార్కింగ్ సౌకర్యం లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కూడా తగిన స్థాయిలో లేవని తెలుస్తోంది. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు, ట్రాఫిక్ మార్పుల కారణంగా ప్రస్తుతం కార్యాలయం ఉన్న రహదారి వన్‌వేగా మారడంతో అధికారిక వాహనాల రాకపోకలు కూడా కష్టతరంగా మారాయి. కొన్ని సందర్భాల్లో ట్రాపిక్ పోలీసులు, ఎక్సైజ్ అధికారుల వాహనాలకు ట్రాఫిక్ చలాన్లు కూడా విధిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

పరిపాలనపై ప్రభావం

సొంత భవనం లేకపోవడంతో కేసుల దర్యాప్తు, స్వాధీనం చేసుకున్న మద్యం, ఇతర వస్తువుల భద్రపరిచే ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ వంటి పరిపాలనా కార్యకలాపాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి

మద్యం అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు కనీసం తాత్కాలికంగా అయినా ప్రభుత్వ భవనం కేటాయించాలని, స్థానికులు కోరుతున్నారు. శాశ్వత భవనం ఏర్పాటు చేసే వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలోకి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను తరలిస్తే అధికారుల ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు, ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story