Uppal: ఉప్పల్‌లో ఘోరం.. నర్సుగా పనిచేస్తున్న భార్యను చంపిన భర్త!
Uppal: హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త. నిందితుడు సురేష్‌ను చిక్కడపల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Uppal: ఉప్పల్‌లో ఘోరం.. నర్సుగా పనిచేస్తున్న భార్యను చంపిన భర్త!
ఉప్పల్: భార్య ప్రవర్తనపై అనుమానం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ ఆదర్శ్‌నగర్‌లో చోటుచేసుకుంది. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు చిక్కడపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సురేష్ (41), హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన జెస్సికా (38)ను 2015లో వివాహం చేసుకున్నాడు. సఫిల్‌గూడలో క్యాబ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సురేష్, తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న జెస్సికాతో కలిసి చిలుకానగర్ ఆదర్శ్‌నగర్‌లో నివాసముంటున్నారు.
వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి, నానమ్మ, బాబాయ్ నివాసం ఉండే బోడుప్పల్ బాలాజీ నగర్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది . భార్య శీలంపై అనుమానం పెంచుకున్న సురేష్, తరచూ జెస్సికాతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఆవేశానికి లోనైన సురేష్ ఇంట్లో ఉన్న పదునైన కత్తితో జెస్సికాపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటన స్థలాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పరిశీలించి దర్యాప్తుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న నిందితుడు సురేష్‌ను పోలీసులు చిక్కడపల్లిలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




