Uppal: ఉప్పల్లో చైన్ స్నాచింగ్ యత్నం.. నిందితుడు అరెస్ట్
Uppal: ఉప్పల్ రామంతాపూర్లో మహిళ మెడలో బంగారు పుస్తెల తాడు లాక్కోవడానికి యత్నించిన నిందితుడు అరెస్ట్. బాధితురాలి కేకలతో పట్టుకున్న స్థానికులు.
Uppal: ఉప్పల్లో చైన్ స్నాచింగ్ యత్నం.. నిందితుడు అరెస్ట్
ఉప్పల్: మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కోవడానికి యత్నించిన యువకుడిని బాధితురాలి అప్రమత్తత, స్థానికుల చాకచక్యంతో పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతాపూర్ నేతాజీ నగర్కు చెందిన డొంకన విమలమ్మ (50) శుక్రవారం ఉదయం పనికి వెళ్లేందుకు గోఖలే నగర్లోని వాటర్ ట్యాంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో మోటార్సైకిల్పై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కోవడానికి ప్రయత్నించాడు.
వెంటనే బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో నిందితుడు రేజేటి బాలరాజు (29)గా గుర్తించారు. ప్రస్తుతం రామంతాపూర్ నేతాజీ నగర్లో నివాసముంటూ పెయింటర్గా పనిచేస్తున్న అతడి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బడంగి మండలం కోటిపల్లి గ్రామమని పోలీసులు తెలిపారు. నిందితుడిని అతడు ఉపయోగించిన మోటార్సైకిల్తో కలిసి ఉప్పల్ పోలీసులకు అప్పగించగా, పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
అప్పుల భారంతో నేర మార్గం
దర్యాప్తులో అప్పుల బాధ నుంచి బయటపడేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బాలరాజు చైన్ స్నాచింగ్కు యత్నించినట్లు వెల్లడైంది. తన మోటార్సైకిల్పై తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యే ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన బాలరాజు పెయింటర్గా పనిచేస్తున్నప్పటికీ, అప్పుల భారంతో నేర మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.




