Malkajgiri: ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిరవధిక బంద్!

Malkajgiri: తెలంగాణలో ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్ ప్రారంభం కానుండగా, ఇందుకు సీపీఐ మద్దతు ప్రకటించింది.

Bodike Manohar, Malkajgiri
Published on: 20 Aug 2026 7:18 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిరవధిక బంద్!

మల్కాజిగిరి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ మల్కాజిగిరి మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం మల్కాజిగిరి రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కాసర్ల నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వివిధ కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి, అధికారంలోకి వచ్చిన వెంటనే గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని రవాణా రంగ కార్మికులు, కార్మిక సంఘాలు స్వాగతించాయని తెలిపారు.

అయితే ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ముఖ్యమంత్రి, రవాణా మంత్రి పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదన్నారు. ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాసర్ల నాగరాజు తెలిపారు. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎండీ హారిఫ్, ఎండీ అహ్మద్, ఎస్కే జాంగీర్, ఏ. సాయి, డి. పప్పు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story