Tandur: తాండూరు అభివృద్ధి కొడంగల్‌కు తరలిపోతోంది: పైలెట్ రోహిత్ రెడ్డి

Tandur: తాండూరు అభివృద్ధిని గాలికి వదిలేసి కొడంగల్‌కు వనరులు తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు.

Srikanth Reddy, Tandur
Published on: 6 Sept 2026 4:18 PM IST
Tandur
X

Tandur: తాండూరు అభివృద్ధి కొడంగల్‌కు తరలిపోతోంది: పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూర్: తాండూరు అభివృద్ధిని గాలికి వదిలేసి కొడంగల్ అభివృద్ధి ధ్యేయంగా తాండూరు వనరులను దోచుక వెళ్లడం ఎంతవరకు సమంజసం అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తాలో పల్లెల విధ్వంసం పడకేసిన పారిశుధ్యం నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ... తాండూరుకు అందాల్సిన నీటి వనరులను కొడంగల్‌కు తరలించుకు పోతున్నారన్నారు. తాండూరుకు రావాల్సిన నిధులను కొడంగల్‌కు మళ్లిస్తున్నారన్నారు. తాండూరు ఆస్పత్రిని కొడంగల్‌కు ధారాదత్తం చేశారన్నారు. ఆర్టీవో కార్యాలయాన్ని కొడంగల్‌కు మార్చారన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానికుడు కాకపోవడంతో తాండూరును పట్టించుకోవడం లేదన్నారు.

లక్ష్మీ నారాయణపూర్ యాలాల రోడ్డు దుస్థితి వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. పల్లెల్లో పారిశుధ్యం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం చెత్తను తొలగించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు వంటి మౌలిక వసతులు సైతం సరిగా లేవని అన్నారు.

తాండూరు పట్టణంలో కూడా రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, రోడ్ల దుస్థితి కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడంతోనే తాండూరు అభివృద్ధి, ప్రజల సమస్యలపై సరైన శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు.

తాండూరుకు రావాల్సిన నిధులు, సౌకర్యాలు ఇతర ప్రాంతాలకు తరలించకుండా ప్రభుత్వం తాండూరు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో పల్లెలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ రమేష్, పిఎసిఎస్ చైర్మన్ వడ్డె రాములు, శివకుమార్, సిద్రాల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story