Tarnaka: ఉస్మానియా వర్సిటీలో SSF 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!
Tarnaka: ఓయూలో SSF 3వ ఆవిర్భావ వేడుకలు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు చారకొండ వెల్లడి.
Tarnaka: ఉస్మానియా వర్సిటీలో SSF 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!
Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ (SSF) ఆధ్వర్యంలో సంస్థ 3వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని అమలు దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
క్రీడా రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారతదేశంలో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం, మెరుగైన శిక్షణా సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో క్రీడా ప్రతిభను గ్రామీణ స్థాయి నుంచే గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా క్రీడా విద్య, శిక్షణ, ప్రతిభాభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని సుమారు వెయ్యి పాఠశాలలను స్పోర్ట్స్ స్కూళ్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జడ్‌పీహెచ్‌ఎస్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయి సంస్థల్లో క్రీడా సదుపాయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులను చిన్న వయస్సు నుంచే క్రీడల వైపు ప్రోత్సహించి, పాఠశాల స్థాయి నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ వరకు నాణ్యమైన శిక్షణ అందిస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయవచ్చన్నారు.
ఈ విధానం ద్వారా రాష్ట్రానికి, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు, మంచి పేరు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి గౌరవించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. మహమ్మద్ సిరాజ్ వంటి క్రీడాకారులను ప్రభుత్వం సత్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
విద్యా వ్యవస్థలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌కు మరింత ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని చారకొండ వెంకటేష్ తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ రంగంలోని ఖాళీల భర్తీ, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల హక్కులు, క్రీడా రిజర్వేషన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. క్రీడా రంగం అభివృద్ధి చెందితే యువతతో పాటు సమాజంలోని అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
SSF నాయకులు మాట్లాడుతూ క్రీడాకారుల హక్కుల పరిరక్షణ, క్రీడా రిజర్వేషన్ల అమలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ కుమార్, ప్రొఫెసర్ స్వాములు, ప్రముఖ రచయిత గుడిపల్లి రవి తదితరులు పాల్గొని క్రీడారంగం అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి జక్కుల వెంకటేష్ అధ్యక్షత వహించగా, SSF ఫౌండర్ ప్రెసిడెంట్ చాగంటి రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నాగన్న, రాష్ట్ర సెక్రటరీ అన్వేష్, హైదరాబాద్ ప్రెసిడెంట్ మీసాల రాజు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రెసిడెంట్ రవి కుమార్ తదితరులతో పాటు విద్యార్థులు, మాజీ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




