Vikarabad: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక తనిఖీలు

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 24 Aug 2026 9:41 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక తనిఖీలు

వికారాబాద్: వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు నేడు వికారాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ముందుగా కార్యాలయ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం కార్యాలయంలోని రికార్డులు, ఫైళ్లు, కేసులకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, వికారాబాద్ సబ్-డివిజన్ పరిధిలోని కేసుల స్థితిగతులను సమీక్షించారు. దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ కేసులు, సీడీ ఫైళ్లు, కోర్టు కేసులు, వారెంట్లు, దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి కేసులో నాణ్యతతో పాటు వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని, శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించాలని, CCTNS మరియు e-Sakshya వంటి సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రౌడీషీటర్లు, అనుమానితులు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణలో భాగంగా బీట్ పోలీసింగ్, పెట్రోలింగ్ మరియు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

నేరాలు జరిగే ప్రాంతాలు, సమయాలు మరియు నేరాల స్వభావాన్ని విశ్లేషించి, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఎస్పీ గారు సూచించారు. ముఖ్యంగా దొంగతనాలు, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

వికారాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితిని కూడా ఎస్పీ గారు సమీక్షించారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను గుర్తించి, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, “ప్రతి కేసు దర్యాప్తులో నాణ్యత, పారదర్శకత మరియు వేగం చాలా ముఖ్యమైనవి. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలి. నేర నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు మరియు పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకు సత్వర మరియు పారదర్శకమైన పోలీస్ సేవలను అందించడమే మన ప్రధాన లక్ష్యం.” అని అన్నారు.

అనంతరం ఎస్పీ గారు డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వార్షిక తనిఖీలో వికారాబాద్ డీఎస్పీ, మోమిన్‌పేట్ సీఐ వెంకట్, సబ్-డివిజన్ ఎస్‌ఐలు, సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story