LB Nagar: మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పోచారం శ్రీనివాస్

LB Nagar: కొత్తపేట శ్రీ కిల మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 Aug 2026 10:10 AM IST
LB Nagar
X

LB Nagar: మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పోచారం శ్రీనివాస్

LB Nagar: మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలోని శ్రీ కిల మైసమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR), దేప భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది” అని అన్నారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలు అమ్మవారి దయేనని, బోనాల అనంతరం అమ్మవారిని వర్షాల కోసం ప్రార్థించగా భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండుతున్నాయని, రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో సుమారు 100 జగదాంబ, దుర్గామాత ఆలయాలు నిర్మించామని, పెద్ద కొండపై రూ.30 కోట్లతో తెలంగాణ తిరుమల దేవస్థానం పేరుతో వెంకటేశ్వర ఆలయం నిర్మించామని తెలిపారు.

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బోనాల పండుగ మన సనాతన సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అని, లోకకల్యాణం, లోకశాంతి కలగాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ, దేవాలయాల పూజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఆలయ కమిటీ నీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story