Fake Currency: ఇన్‌స్టా రీల్స్ చూసి కోటీశ్వరులు కావాలని ప్లాన్.. కట్ చేస్తే కటకటాల పాలయ్యారు
Fake Currency: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇంట్లోనే నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న ముగ్గురిని శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Fake Currency
Fake Currency: సోషల్ మీడియాను సరదా కోసం వాడితే పర్లేదు కానీ నేరాలను చేయడానికి వాడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నిరూపించే ఉదంతం శంషాబాద్‌లో వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇంట్లోనే నకిలీ నోట్లు ప్రింట్ చేస్తూ మార్కెట్లో చెలామణి చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రమావత్ రాము, రమావత్ మోతీలాల్, రమావత్ గాంధీ తమ స్నేహితుడు సుధీర్‌తో కలిసి శ్రమపడకుండా సులభంగా కోట్లు సంపాదించాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వెతుకుతూ ఉత్సాహం ప్రదర్శించారు. సాధారణ కలర్ ప్రింటర్లు, క్వాలిటీ కాగితాలు ఉపయోగిస్తూ నకిలీ నోట్లు ఎలా ముద్రించవచ్చో రీల్స్ ద్వారా నేర్చుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ఇంట్లోనే కలర్ ప్రింటర్ సహాయంతో ప్రింట్ చేయడం ప్రారంభించారు.
చీకటి పడితేనే కేటుగాళ్ల విక్రయాల దందా
పగటిపూట నిశ్శబ్దంగా ఇంట్లోనే నోట్లను ముద్రిస్తూ రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వచ్చేవారు. రద్దీగా ఉండే మద్యం దుకాణాలు, పక్కనున్న చిన్న చిన్న దాబాలు, రోడ్డు పక్కన ఉండే పాన్ డబ్బాలను ప్రధానంగా టార్గెట్ చేసుకునేవారు. చీకటి వెలుతురును, నిర్వాహకుల త్వరితగతిన ఇచ్చిపుచ్చుకునే తొందరపాటును ఆసరాగా చేసుకుని అసలు నోట్ల మధ్యలో ఈ నకిలీ కరెన్సీని సులువుగా ఇచ్చేసేవారు. చిన్న మొత్తంలో సామాన్లు కొని మిగిలిన చిల్లరను అసలు నోట్ల రూపంలో పొందుతూ దర్జాగా తిరిగారు.
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడితో గుట్టురట్టు
స్థానికంగా ఫేక్ కరెన్సీ చెలామణి అవుతోందనే సమాచారం అందుకోవడంతో శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా వ్యూహంతో నిఘా పెట్టి దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల ముద్రణకు వాడిన కలర్ ప్రింటర్, ల్యామినేషన్ మెషిన్, ఇంక్ కార్ట్రిడ్జ్‌లు, ఇతర కాగితాలను పోలీసులు జప్తు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సుధీర్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.
సోషల్ మీడియా కంటెంట్ మేకర్లకు హెచ్చరిక
ఈ ముఠా అరెస్ట్ వివరాలను వెల్లడిస్తూ శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి కె.ఎస్.రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా నేరాలను ప్రేరేపించేలా నకిలీ నోట్ల ముద్రణ, ఇతర చట్టవిరుద్ధ పనులపై రీల్స్ చేసేవారిని, వాటిని లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేసేవారిని సైతం చట్టరీత్యా తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




