Shabad: రేడియల్ రోడ్డు డిజైన్‌పై రైతుల ఆందోళన - MROకు వినతిపత్రం

Shabad: షాబాద్ మండలంలో రేడియల్ రోడ్డు కూడలి భూసేకరణ డిజైన్‌పై రైతులు ఆందోళన వ్యక్తం చేసి, MROకు వినతిపత్రం అందజేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 29 Aug 2026 5:49 PM IST
Shabad
X

Shabad: రేడియల్ రోడ్డు డిజైన్‌పై రైతుల ఆందోళన - MROకు వినతిపత్రం

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సంకేపల్లి గూడ, మల్లారెడ్డి గూడ గ్రామాలకు చెందిన రైతులు రేడియల్ రోడ్డు కూడలి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ, రోడ్డు డిజైన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. కూడలి రోడ్డు విస్తరణలో భాగంగా జంక్షన్ పరిధిలో సుమారు 46 ఎకరాల భూమి ప్రభావితమవుతుందని, అయితే ఒకవైపు తక్కువగా, మరోవైపు ఎక్కువగా భూములు కోల్పోయే విధంగా డిజైన్ ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు .

డిజైన్ కారణంగా స్థానిక రైతుల సాగు భూములు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ఒకవైపు ఉన్న భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందినవని, వారిలో చాలామంది స్థానికులు కాదని రైతులు ఆరోపించారు. ప్రస్తుత డిజైన్ రియల్ ఎస్టేట్ భూములకు అనుకూలంగా ఉండేలా ఉందని, దీంతో స్థానిక రైతుల వ్యవసాయ భూములు ఎక్కువగా కోల్పోవాల్సి వస్తోందని వారు వాపోయారు.

రైతుల అభ్యంతరాలను పరిశీలించి రోడ్డు డిజైన్‌ను పునఃపరిశీలించాలని కోరుతూ షాబాద్ MROకు రైతులు వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణం అవసరమే అయినప్పటికీ, అభివృద్ధి పేరుతో స్థానిక రైతులకు అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, సమతుల్యమైన డిజైన్‌ను పరిశీలించాలని రైతులు కోరారు.

గ్రంథాలయ సంస్థ చైర్మన్ జోక్యం

రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూదన్ రెడ్డి షాబాద్ నుంచి వెళ్తున్న సమయంలో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, రోడ్డు డిజైన్ కారణంగా రైతులకు కలుగుతున్న నష్టంపై అధికారులతో మాట్లాడారు.

అనంతరం రైతులకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు డిజైన్‌ను పునఃపరిశీలించి, సాధ్యమైనంత వరకు రైతుల భూములు తక్కువగా నష్టపోయే విధంగా రీడిజైన్ చేయాలని MROను కోరారు. అభివృద్ధి పనులతో పాటు రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

3 రోజుల్లో పునఃపరిశీలన చేస్తాం: MRO

రైతుల అభ్యంతరాలపై షాబాద్ MRO స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్నది కేవలం పెగ్ మార్కింగ్ మాత్రమేనని, ఇదే తుది నిర్ణయం కాదని స్పష్టం చేశారు. రైతులు తమకు ఉన్న అభ్యంతరాలు, సూచనలను తెలియజేశారని, వాటన్నింటినీ పరిశీలించి సమస్యను సానుకూలంగా పునఃపరిశీలిస్తామని తెలిపారు.

రైతులకు అనుకూలంగా ఉండే విధంగా సాధ్యమైన మార్పులను పరిశీలించి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని MRO హామీ ఇచ్చారు.

దీంతో రైతులు తమ భూములు, జీవనోపాధికి నష్టం కలగకుండా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డు అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే స్థానిక రైతులకు అన్యాయం జరగకుండా సమానమైన డిజైన్‌తో ప్రాజెక్టును చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story