Secunderabad: మత్తు నీళ్లు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరు రియల్టర్ల అరెస్ట్
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మత్తు నీళ్లు ఇచ్చి లగేజ్ దోచుకుంటున్న ఇద్దరు రియల్టర్లను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Secunderabad: మత్తు నీళ్లు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరు రియల్టర్ల అరెస్ట్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణికులను మత్తు పదార్థాలు కలిపిన నీళ్లు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరు దొంగలను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక మొబైల్ ఫోన్, నగదు 500 రూపాయలు, 10 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు భాత ప్రసాద్ అలియాస్ ప్రసాద్ రెడ్డి, కోరపాటి నర్సింగ్ రావుగా గుర్తించారు. ఇద్దరూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా పరిచయం ఉన్న వీరు, మద్యానికి బానిసలై అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు.
ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన నిందితులు, మత్తు మాత్రలు కలిపిన వాటర్ బాటిల్ ను బ్యాగ్ లో పెట్టుకున్నారు. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లోని S-3 కోచ్ లోకి ఎక్కారు. అదే బోగీలో ప్రయాణిస్తున్న అనిల్ కుమార్ అనే ప్రయాణికుడితో మాట కలిపి, పరిచయం పెంచుకున్నారు.
అనంతరం మత్తు కలిపిన నీళ్లను అతడికి ఇచ్చారు. నీళ్లు తాగిన కొద్దిసేపటికే బాధితుడు మత్తులోకి జారుకుని నిద్రపోయాడు.దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు బాధితుడి లగేజ్ బ్యాగ్ ను దొంగిలించారు. ఒక నిందితుడు బ్యాగ్ తో బయటకు వెళ్లి వేచి ఉండగా, మరొకరు తర్వాత బయటకు వచ్చారు.
బ్యాగ్ లో ఉన్న ఒప్పో మొబైల్ ఫోన్, 5,400 రూపాయల నగదు తీసుకుని, మిగిలిన వస్తువులను చెత్తబుట్టలో పడేశారు. నగదులో 400 రూపాయలతో మద్యం తాగి, మిగిలిన 5 వేలను పంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.




