Narapalli: కలెక్టర్ ఎన్‌ఓసీ ఉన్నా రిజిస్ట్రేషన్ నిరాకరణ: నారపల్లిలో బాధితుల నిరసన
Narapalli: కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ తెచ్చినా నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నిరాకరించడంతో బాధితులు, రియల్టర్ల సంఘం నిరసనకు దిగింది.
Narapalli: కలెక్టర్ ఎన్‌ఓసీ ఉన్నా రిజిస్ట్రేషన్ నిరాకరణ: నారపల్లిలో బాధితుల నిరసన
నారపల్లి: కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ పొందినా రిజిస్ట్రేషన్ జరగలేదని బాధితులు ఆరోపించారు. పైగా స్లాట్ సమయం ముగిసే వరకు కార్యాలయంలో వేచి ఉంచి.. చివరకు ఎన్‌ఓసీ చెల్లదని చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమ్మకందారులు, కొనుగోలుదారులు నిరసనకు దిగారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల పరిధిలోని సర్వే నంబర్లు 33/10, 33/11లోని 103బీ ప్లాట్ నంబరులో సుమారు 200 గజాల స్థలాన్ని కురుమ జయమ్మ నుంచి మహేష్, బాబు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అయితే కొనుగోలు చేసిన కొద్ది రోజులకే ఆ స్థలం 22ఏ జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సూచన మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ తీసుకురావాలని చెప్పడంతో సుమారు మూడు నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ క్రమంలో సంబంధిత స్థలంపై సర్వే నిర్వహించిన అనంతరం 2026 జూలై 30న కలెక్టర్ కార్యాలయం ఎన్‌ఓసీ జారీ చేసిందని చెప్పారు.
ఆ పత్రంతో రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించగా సెప్టెంబరు 5న ఉదయం 11 గంటలకు స్లాట్ లభించింది. నిర్ణీత సమయానికి నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయకుండా గంటల తరబడి వేచి ఉంచారని ఆరోపించారు.
సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండటంతో అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన ఎన్‌ఓసీని పరిశీలించిన అనంతరం ‘ఈ పత్రం చెల్లదు’ అని చెప్పి రిజిస్ట్రేషన్ నిరాకరించారని బాధితులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదో రాతపూర్వకంగా ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
ఇన్నాళ్లు ఎలా చేశారు?
విషయం తెలుసుకున్న తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. 22ఏ జాబితాలో ఉన్న భూములకు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ తీసుకురావాలని గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి బాధితులకు సూచించారని, ఆ ఎన్‌ఓసీల ఆధారంగా పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
‘కలెక్టర్ జారీ చేసిన ఎన్‌ఓసీ చెల్లదంటే.. గతంలో అదే పత్రాల ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్ల సంగతేంటి? చెల్లని పత్రాలైతే వాటిని తీసుకురావాలని బాధితులకు అధికారులు ఎందుకు సూచించారు?’ అని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించి సమస్యను వివరించగా.. కలెక్టర్ ఎన్‌ఓసీ ఇచ్చారన్న కారణంతోనే రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఏ చట్టంలో ఉందో చెప్పాలని ఆయన సమాధానమిచ్చినట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
మళ్లీ స్లాట్.. ఎప్పుడో?
రిజిస్ట్రేషన్ కోసం మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారని, అయితే సెప్టెంబరు 13వ తేదీ వరకు స్లాట్‌లు అందుబాటులో లేవని, ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో వేచి ఉన్న బాధితులు చివరకు నిరాశతో వెనుదిరిగారని చెప్పారు.
ఉప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల నుంచి ఎన్‌ఓసీలు పొందిన అనంతరం గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్‌ఓసీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధమైతే.. గతంలో రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
22ఏ భూముల విషయంలో ఎన్‌ఓసీ జారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కోరింది. బాధితుల సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.




