Rangareddy: భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం విలీనం చేయాలి జేఏసీ డిమాండ్!
Rangareddy: రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం ప్రాంతాన్ని పూర్తిగా విలీనం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు.
Rangareddy: భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం విలీనం చేయాలి జేఏసీ డిమాండ్!
Rangareddy: ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాలని ఫ్యూచర్ సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మహేశ్వరంలో శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో మహేశ్వరం, కందుకూరు మండలాలకు చెందిన కొన్ని గ్రామాలు ఇప్పటికే విలీనమయ్యాయని జేఏసీ నాయకులు తెలిపారు. మిగిలిన గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో చేర్చాలని కోరుతూ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎంపీడీవోతో పాటు జేఏసీకి అందజేయాలని సూచించారు.
ఈ అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.జేఏసీ ఛైర్మన్ వత్తుల రఘుపతి మాట్లాడుతూ.. సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, విద్య, వైద్యం, తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం పెట్టుబడుల ఆకర్షణకు నిదర్శనమన్నారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటైతే స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే రహదారులు అభివృద్ధి కానుండటంతో మహేశ్వరం రవాణాపరంగా కీలక ప్రాంతంగా మారుతుందని తెలిపారు.
బుల్లెట్ ట్రైన్, మెట్రో, రతన్ టాటా 300 ఫిట్ రేడియల్ రోడ్లు, మల్టీమోడల్ రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందన్నారు.కొత్త పరిశ్రమలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, రహదారుల అభివృద్ధితో రియల్ ఎస్టేట్, నిర్మాణం, రవాణా, హోటళ్లు, చిన్న వ్యాపారాలు, సేవా రంగాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే మహేశ్వరం ప్రాంతానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని, భవిష్యత్ తరాలకు మెరుగైన నగరాన్ని అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీ ముందుకు రావాలని ఆయన కోరారు.
ఫ్యూచర్ సిటీలో విలీనం కోసం తీర్మానం చేయని గ్రామాల సర్పంచ్‌ల తీరుకు నిరసనగా ఈ నెల 31, సెప్టెంబర్ 1న మహేశ్వరం లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వట్టేలా మల్లేష్ యాదవ్, రాష్ట్ర బీజేపీ నాయకుడు కడారి జంగయ్య, సీపీఐ నాయకుడు దత్తునాయక్, బీజేపీ మాజీ ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు ఎర్ర గణేష్, జేఏసీ సలహాదారు కె. జగన్‌రెడ్డి, గోటికె రవీందర్‌రెడ్డి, నర్సింహా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




