Pocharam: కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ వంటా-వార్పు నిరసన
Pocharam: పోచారం అన్నోజిగూడ పీహెచ్‌సీ కాలనీలో కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బిఆర్ఎస్ వంటా-వార్పు నిరసన.
Pocharam: కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ వంటా-వార్పు నిరసన
పోచారం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం 1,000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఏడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నోజిగూడలోని పీహెచ్‌సీ (వికలాంగుల) కాలనీలో బీఆర్‌ఎస్ నాయకుడు సామల సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, మహిళా విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం, రైతులకు రైతు భరోసా వంటి పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
మొత్తం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని విమర్శించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ హామీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని కోరారు. హామీల అమలుపై ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా, ఎన్నికల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. హామీల అమలు కోసం రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పి, బీఆర్‌ఎస్ పార్టీని అధిక స్థానాల్లో గెలిపించనున్నారని భద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.




