Parigi: పరిగిలో గంజాయి కలకలం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
Parigi: పరిగి జిమ్‌ఖానా గ్రౌండ్ వద్ద 1.1 కిలోల గంజాయి స్వాధీనం. బీహార్ నుంచి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు.
Parigi: పరిగిలో గంజాయి కలకలం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
పరిగి: పరిగి పట్టణంలోని జిమ్‌ఖానా గ్రౌండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల నుంచి 6 గంటల మధ్య జిమ్‌ఖానా గ్రౌండ్ వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో TS 07 FB 1825 నంబర్ గల స్కూటీపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా సుమారు 1 కిలో 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. పోలీసుల విచారణలో అరెస్టైన వారిని తన్వీర్ అహ్మద్, మహమ్మద్ ఉమర్, అబ్దుల్ కలీమ్గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మొదటి నిందితుడు తన్వీర్ అహ్మద్ బీహార్ రాష్ట్రంలోని తన స్వగ్రామం నుంచి గంజాయిని తీసుకువచ్చి పరిగిలో ఉన్న మరో ఇద్దరికి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు గంజాయిని ఇతరులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1.1 కిలోల గంజాయితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సేవించే వారు, విక్రయించే వారు లేదా అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
గంజాయికి సంబంధించిన అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.




