Pargi: మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహణ

Pargi: రబీ-ఉల్-అవ్వల్ మాసం సందర్భగా పరిగి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరం. 44 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా బాధితులకు ఆసరా.

WAZID, PARIGI
Published on: 23 Aug 2026 6:44 PM IST
Pargi
X

Pargi: మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహణ

పరిగి: పవిత్ర రబీ-ఉల్-అవ్వల్ మాసం మరియు ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం (మిలాద్-ఉన్-నబీ) సందర్భంగా, పరిగిలోని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 5వ మిలాద్ రక్తదాన శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. పరిగిలోని కుతుబ్ షాహీ జామా మసీదు పక్కన ఆశుర్ఖానాలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు మరియు రోగులకు ఆసరాగా నిలిచేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక యువత, ప్రజలు విశేష స్పందన కనబరిచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొత్తం 44 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమం మిలాద్ కమిటీ సదర్ (అధ్యక్షులు) ఖాజీ ఖాజా అజారుద్దీన్ ఖాద్రీ పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... "రక్తానికి మతం, కులం, లింగ భేదం మరియు రాజకీయ, భౌగోళిక సరిహద్దులు తెలియవు; దానికి కేవలం ఒకరి ప్రాణాన్ని కాపాడటం మాత్రమే తెలుసు" అని పేర్కొన్నారు. మానవాళికి మనిషి ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమతి రక్తదానం అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలందరికీ మిలాద్ కమిటీ పరిగి సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story